Begin typing your search above and press return to search.

వారసత్వంపై కనిమొళి క్లారిటీ..!

By:  Tupaki Desk   |   14 March 2021 3:30 PM GMT
వారసత్వంపై కనిమొళి క్లారిటీ..!
X
తమిళనాడు రాజకీయాలు ఎంతో భిన్నమైనవి. వారసత్వ రాజకీయాలు, సినీ గ్లామర్​ అక్కడి రాజకీయాల్లో చాలా కామన్​. తమిళనాట ప్రచారశైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే తమిళ రాజకీయాలంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంటుంది. మరోవైపు తమిళ రాజకీయాలకుచ, సినిమాలకు కూడా వీడదీయరాని బంధం ఉంటుంది. తమిళ రాజకీయాలను శాసించిన నేతలంతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లే కావడం గమనార్హం. తమిళ రాజకీయాలకు సినిమాలకు సంబంధం ఉంటుంది కాబట్టి అక్కడి రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఇదిలా ఉంటే వారసత్వ రాజకీయాలకు కూడా తమిళనాడు పెట్టింది పేరు. డీఎంకే నేత, దివంగత కరుణానిధి కుమారుడు స్టాలిన్​ ప్రస్తుతం డీఎంకేకు ముఖ్యమంత్రి అభ్యర్థి. మరోవైపు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్​ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీచేయబోతున్నారు. ఉదయనిధి తన వారసుడని.. భవిష్యత్​లో ఆ పార్టీకి అతడే సారథి అని పరోక్ష సంకేతాలు ఇచ్చారు స్టాలిన్​.

ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో కనిమొళి కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కరుణానిధి గారాలపట్టి కనిమొళికి .. పెద్దాయన ఉన్నన్ని రోజులు ఎంతో ప్రాధాన్యం ఉండేది. ఇప్పుడు స్టాలిన్​ వచ్చాక ఆమెకు కొంత ప్రాధాన్యత తగ్గినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు. కనిమొళి కుమారుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆమె ఖండించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావడం లేదని.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనిమొళి మాట్లాడారు.

‘ డీఎంకే అధినేత స్టాలిన్​తో నాకు ఎటువంటి విభేదాలు లేవు. అవన్నీ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాలే. స్టాలిన్​ నాయకత్వంలో నేను ఎంతో సౌకర్యంగా పనిచేస్తున్నాను. డీఎంకేను అధికారంలోకి తీసుకురావలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాను. ఇక నా కుమారుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే వార్త పూర్తిగా సత్యదూరం. ఇది కేవలం మీడియా సృష్టి మాత్రమే’ అంటూ ఆమె కుండ బద్దలు కొట్టారు. దీంతో ఈ ప్రచారానికి తెరపడింది.