Begin typing your search above and press return to search.

ఇవ్వడం మానేసి ఎదురుదాడా...?

By:  Tupaki Desk   |   26 May 2015 12:30 PM GMT
ఇవ్వడం మానేసి ఎదురుదాడా...?
X
మొగుడిని కొట్టి మొగసాలకెక్కిందన్నట్లుగా ఉంది బీజేపీ నాయకుల తీరు. కేంద్రంలో అధికారంలో ఉంటూ ఇతర దేశాలకు వేల కోట్లు ఉదారంగా ఇచ్చేస్తూ సొంత దేశంలో కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఆ పార్టీ నాయకులు ఏపీ ప్రభుత్వంపైనే ఎదురుదాడి చేస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్‌ సమస్యల్లో ఉన్న సంగతి తెలిసిందే. విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే... బీజేపీ ప్రభుత్వం మాత్రం ఆ విప్తిని పెడచెవిన పెడుతోంది. సరికదా.... ఏపీలోని బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సింది పోయి కేంద్ర చేస్తున్న అన్యాయానికి వత్తాసు పలుకుతున్నారు. అంతేకాదు.... ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీని విమర్శిస్తూ కాలం గడిపేస్తున్నారు.

ఇటీవల బీజేపీకి చెందిన సోము వీర్రాజు, మురళీధరరావు... తాజాగా కన్నా లక్ష్మీనారాయణ టీడీపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు కురిపించారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిణామాలకు బీజేపీని దోషిగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. ఏపీ రాజధానికి భూ సేకరణతో పాటు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ సీనియర్‌ నేతలు ఖండిస్తున్నారు.

అంతేకాదు, ఏపీ రాజధాని విషయంలోనూ వేలు పెడుతున్నారు. రైతులను మెప్పించి భూములు తీసుకోవాలనే కానీ, బలవంతంగా భూములు సేకరించకూడదని ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధరావు అనడం తెలిసిందే. రైతుల కన్నీళ్లపైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నిర్మాణం చేయడాన్ని భారతీయ జనతాపార్టీ ఎంతమాత్రం సమర్థించదని ఆయన అన్నారు. రాజధానిని నిర్మించుకోవడం ముఖ్యమైన అంశమే అయినప్పటికీ రైతులను మెప్పించే వారి భూములను తీసుకోవాలని మురళీధరరావు డైరెక్టుగా అన్నారు. తాజాగా బీజేపీ సీనియర్‌ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా మంగళవారం చంద్రబాబు నాయుడుపై విరుచుకు పడ్డారు. అధికారంలోకి రాకముందు, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను చంద్రబాబు సీఎం పదవి చేపట్టిన తర్వాత అమలు చేశారా అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని కన్నా మండిపడ్డారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారా అని ఎదురు ప్రశ్నించారు.



మొత్తానికి రాష్ట్రంలోని బీజేపీ నేతల వ్యవహారం చూస్తుంటే... వారికి ఏపీ అభివృద్ధి... ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని అనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంటూ కూడా ఇలా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఇంకెక్కడా ఉండదేమో కూడా. కష్టాల్లో ఉన్న ఏపీకి సాయం చేయమని కేంద్రాన్ని అడగడం మానేసి రాష్ట్రంపైనే రాళ్లేస్తున్నారంటే వీళ్లనేమనాలో మరి..?