Begin typing your search above and press return to search.

ఈ ప్రశ్నలకు బదులేది? బాబు: కన్నా

By:  Tupaki Desk   |   7 Nov 2018 10:22 AM GMT
ఈ ప్రశ్నలకు బదులేది? బాబు: కన్నా
X
బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. కేంద్రం రాష్ట్రానికి ఎక్కడ అన్యాయం చేసిందని - రాష్ట్ర కంపెనీలకు ఇచ్చిందెంత? పుచ్చుకున్నదెంత? - టీడీపీ అవినీతి అక్రమాల పై ప్రశ్నలు సంధిస్తున్న కన్నా - తాజాగా మరో 8 ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. లేకపోతే సీబీఐ విచారణను ఎదుర్కొనే దమ్ముందా అని అన్నారు. కన్నా వేస్తున్న ప్రశ్నలపై ఇప్పటి వరకు చంద్రబాబు స్పందించలేదు. ఇప్పటి వరకు 92 ప్రశ్నలు వేశారు కన్నా.

93వ ప్రశ్న: రాష్ట్రానికి బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకువస్తామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం - కంపెనీలకు ఇస్తున్న రాయితీలు రాష్ట్రానికి నష్టం కలిగించడం లేదని చెప్పగలరా? 12 యేళ్లలో రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన హెచ్ సీఎల్ కంపెనీకి ఇచ్చిన రాయితీలు రూ. 2,223.9 కోట్లు. వీరికి కేటాయించిన 49.86 ఎకరాల విలువ సుమారు రూ.700 కోట్లు. వీటన్నింటిలో ముడుపులు అందలేదని చెప్పగలరా? గొప్ప ఆర్థిక వేత్త అని చెప్పుకొనే చంద్రబాబు... రాష్ట్రానికి వచ్చేదెం? రాష్ట్రం ఈ కంపెనీలకు ఇచ్చేది ఎంత? అన్న అంశాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం లేదా? ఈ వ్యవహారం పై సీబీఐ విచారణకు సిద్ధమా?

94వ ప్రశ్న: నెల్లూరు జిల్లాలోని కిసాన్‌ సెజ్‌ లో భూకేటాయింపులు - భూములను కేటాయించిన సంస్థలు పరిశ్రమలను ప్రారంభించకపోవడం - ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు పలుమార్లు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజం కాదా? ఇందులో కోదండ రామస్వామి దేవాలయానికి సంబంధించిన 1000 ఎకరాలు ఉన్న మాట వాస్తవం కాదా? దేవుడి భూములు అనే భయం - భక్తి కూడా లేకుండా పరిహారం చెల్లించకపోవడం ఏమిటి? అమ్మోనియా యూరియా ప్లాంట్‌కు కేటాయించిన ఈ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎలా చేస్తున్నదని చీఫ్‌ జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ - ఎస్‌ వీ భట్‌ ల హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించలేదా? ఎకరం రూ.13 వేలకు ఈ భూములన్నీ కేటాయిస్తే, రూ.50 లక్షలకు అమ్మిన మాట వాస్తవం కాదా? ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నేతలకు ముడుపులు అందలేదని ప్రకటించగలరా? దీని పై సీబీఐ విచారణకు సిద్ధమా? సంక్రాంతి - క్రిస్మస్‌ - రంజాన్‌ పండుగలకు చంద్రన్న కానుకల పేరిట ఇస్తున్న సరుకుల సరఫరా బాధ్యత టీడీపీ కార్యకర్తలకు అప్పగించి - నాసిరకం సరుకులు పంపిణీ చేసి జేబులు నింపుకుంటున్న విషయం వాస్తవం కాదా?, పేదలకు - పిల్లలకు - మహిళలకు - వృద్ధులకు నిర్దేశించబడిన సంక్షేమ పథకాలు అందించే విషయంలో విఫలమైన అవినీతి పాలన ఇంకా కావాలా ప్రజలకు?

95వ ప్రశ్న: అసమర్థ - అవినీతి పాలన వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సక్రమంగా చేరకపోవడం వల్ల రూ.వేల కోట్లు దుర్వినియోగం అయిన మాట వాస్తవం కాదా?

విజిలెన్సు అండ్‌ ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ విభాగం 791 నివేదికలలో రూ.10,773 కోట్ల మేరకు సంక్షేమ పథకాలలో నష్టం వాటిల్లిందని - ఇది కూడా ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరిగిందని పేర్కొనలేదా? పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తోన్న బియ్యం వారికి చేరకుండా తిరిగి ప్రభుత్వ ఖజానాకే జమ అవుతోన్న తీరుతో ప్రభుత్వమే పేద ప్రజల పొట్టకొడుతున్న మాట నిజం కాదా? ఈ పాస్‌ విధానం ప్రవేశపెట్టాక 2015 నుంచి ఇప్పటివరకు రేషన్‌ బియ్యం తీసుకోని కారణంగా ప్రభుత్వానికి రూ.1800 కోట్ల విలువైన బియ్యం ఆదా చేసుకున్న విషయం వాస్తవం కాదా? ఆ రేషన్‌ బియ్యం అంతా కూడా రెక్కాడితే గానీ డొక్కాడని వలస కూలీలకు సంబంధించినవి కాదా? వారి పొట్టగొట్టడానికి మీకు మనసెలా వచ్చింది?

96వ ప్రశ: మొత్తం రాష్ట్రం ఆస్తులన్నీ ఎడాపెడా ఎందుకు తాకట్టు పెడుతున్నారో ప్రజలకి ఒకసారి వివరిస్తారా? ఇష్టా రాజ్యంగా దుబారా ఖర్చులు చేయడం - ఎఫ్‌ ఆర్‌ బీఎం నిబంధనలను తప్పించుకోవడానికి సీఆర్‌ డీఏ - ఇతర ప్రభుత్వ విభాగాల చేత అప్పులు చేయించడం - దానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వడం - మొత్తానికి చాలా గొప్ప స్కెచ్‌ వేశారు. రాష్ట్రాన్ని ప్రభుత్వ విభాగాలను అప్పుల పాలు చేసి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. సుమారు రూ.11 వేల కోట్లు అప్పులు చేసేందుకు ఏర్పాట్లు జరిగిన మాట వాస్తవం కాదా? ఈ అస్తవ్యస్త ప్రణాళికల ద్వారా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేస్తున్న మాట నిజం కాదా? ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకి సిద్ధమా?

97వ ప్రశ్న: అవినీతిలో టీడీపీ అనుచరులు మించిపోయారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే రైతులకు - సందర్శకులకు అల్పాహారం - భోజనం ఏర్పాటు చేసినందుకు ఒక్కొక్కరికి రూ.275 చెల్లిస్తున్నారు. అడ్వోకేట్‌ జనరల్‌ బంధువు నిర్వహిస్తున్న ఈ భోజనశాలలో 10 మంది వచ్చినా బస్సు నిండా వచ్చినట్లు రికార్డుల్లో రాసుకుని ఇందులో కూడా అవినీతి చేయగలగడాన్ని మెచ్చుకోవాల్సిందే.

98వ ప్రశ్న: దళితులను అవమానించడం - మోసగించడం తప్ప టీడీపీ ప్రభుత్వానికి వేరే పని లేదా? భోగాపురం విమానాశ్రయానికి సేకరించిన దళితుల భూముల విషయంలో వారికిచ్చే పరిహారంలో మోసపూరిత వేలిముద్రలు వేయించుకోవటమా? ప్రభుత్వం ఇంత అన్యాయం చేయటమా? మీ అన్యాయాన్ని తెలుసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్ర రావు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసి - దళితులకు కూడా మిగిలిన వారి వలె ఎకరానికి రూ.28 లక్షలు చెల్లించామని ఆదేశించలేదా? తప్పుడు వేలిముద్రలు వేయించుకున్నందుకు ప్రభుత్వం మీద చీటింగ్‌ కేసు పెట్టనక్కరేలా?

99వ ప్రశ్న: పేదలకు అత్యంత ప్రధానమైన వైద్య - ఆరోగ్య రంగాలను ప్రభుత్వం సర్వనాశనం చేయలేదని చెప్పగలరా? ఆదివాసీలకు - గిరిజనులకు - బలహీన వర్గాల ప్రజల కోసం ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కునారిల్లే విధంగా చేసేశారు. వైద్య ఆరోగ్య సర్వీసులన్నీ ప్రైవేటీకరించి - అవినీతికి తెరతీయలేదా? జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధులు వినియోగించకుండా బ్యాంకుల్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో చెప్పగలరా? దేశంలో వినూత్న ప్రయోగం అని ఆర్భాటం చేసిన విశాఖపట్నం మెడిటెక్‌ లో జరుగుతున్న అవకతవకలకు ప్రజలకు సమాధానం చెప్పరా? సీఈఓగా నియమితులైన జితేంద్ర కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో - కుమారుని కనుసన్నలలో జరుగుతున్న భూ కుంభకోణం - బినామీలకు చెల్లింపులు - వీటన్నింటి మీద సీబీఐ విచారణకు సిద్ధమా?

100వ ప్రశ్న: రాష్ట్రంలో పంట కుంటల తవ్వకంలో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంపై ప్రభుత్వానికి సమాచారం లేదా? కేంద్ర ప్రభుత్వం అందించిన ఉపాధి హామీ నిధులలో ఒక్క అనంతపురం జిల్లాలోనే 61,729 కుంటలను తవ్వినట్లు తప్పుడు లెక్కలు చూపించి కోట్లాది రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులను మింగిన మాట వాస్తవం కాదా? దీని పై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని కన్నా ప్రశ్నలు వేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంధిస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు - ఇతర పార్టీ నేతలు ఎవరూ సమాధానం ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వ దోపిడీని - అక్రమాలను ఆయన మాత్రం ఎప్పటికప్పుడు బహిర్గత పరుస్తూ ప్రజల ముందు చంద్రబాబును దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.