Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీ చీఫ్ మాట: కేంద్రం జోక్యం చేసుకోదు

By:  Tupaki Desk   |   22 Jan 2020 12:36 PM GMT
ఏపీ బీజేపీ చీఫ్ మాట: కేంద్రం జోక్యం చేసుకోదు
X
మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో చాలా దూకుడుగా వెళ్తోంది జగన్ సర్కారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అమరావతి నుంచి పాలనా రాజధానిని తరలించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టమైంది. ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఏమీ చేయగలిగే స్థితిలో లేదు. శాసన మండలిలో ఈ తీర్మానం నెగ్గకుండా గట్టిగానే ప్రయత్నిస్తున్నప్పటికీ.. అవసరమైతే మండలిని రద్దు చేసి అయినా పంతం నెగ్గించుకోవాలని జగన్ సర్కారు భావిస్తోంది. ఇలాంటి స్థితిలో అమరావతి రైతులు - రాజధానిగా ఆ ప్రాంతమే ఉండాలని కోరుకుంటున్నవాళ్ల ఆశలు కేంద్ర ప్రభుత్వం మీదే ఉన్నాయ. భాజపాకు చెందిన కొందరు నేతలతో పాటు.. ఇటీవలే ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం జగన్ సర్కారుకు కేంద్రం తప్పకుండా అడ్డం పడుతుందని.. రాజధాని తరలిపోకుండా చూస్తుందని అంటున్నారు.

కానీ భారతీయ జనతా పార్టీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ మాత్రం అలాంటి ఆశలేం పెట్టుకోవద్దనేలా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన విషయంలో జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాల పరిధిల్లోని వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్నది కేంద్రం ఉద్దేశమని - అందుకే పశ్చిమ బెంగాల్ సహా కొన్ని రాష్ట్రాల్లో అరాచక పరిస్థితులు నెలకొన్నప్పటికీ కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని.. ఏపీలో రాజధాని తరలింపు విషయంలోనూ కేంద్రం స్పందించకపోవచ్చని ఆయన అన్నారు. మరి రాజధాని తరలింపును భాజపా ఎలా అడ్డుకుంటుందని అడిగితే.. ప్రజా క్షేత్రంలోకి వెళ్తామని - పోరాటాలు చేస్తామని - అలాగే ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయనన్నారు. ఇదిలా ఉండగా.. కర్నూలులో హైకోర్టు పెట్టడాన్ని తాము సమర్థిస్తున్నామని.. భాజపా చాలా ఏళ్ల కిందటే రాయలసీమలో హైకోర్టు పెట్టాలన్న తీర్మానం చేసిందని ఆయన చెప్పడం గమనార్హం.