Begin typing your search above and press return to search.

టీడీపీలో అంద‌రూ దొంగ‌లే

By:  Tupaki Desk   |   17 Oct 2018 5:25 PM GMT
టీడీపీలో అంద‌రూ దొంగ‌లే
X
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మ‌రోసారి మండిపడ్డారు. టీడీపీలో అంద‌రూ దొంగ‌లేన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాల్ మనీ, సెక్స్‌రాకెట్‌ నిందితులు, దుర్గగుడిలో కొబ్బరి చిప్పలు, చెప్పులు దొంగిలించే దొంగలే టీడీపీలో ఉన్నారని తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ నేతల భాష‌....స‌రిగా లేద‌ని, రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడే భాష అది కాద‌ని అన్నారు. టీడీపీ నేత‌ల అన్ పార్ల‌మెంట‌రీ లాంగ్వేజ్ పై గతంలో కూడా ధర్నా చేశామని క‌న్నా గుర్తు చేశారు. చంద్ర‌బాబును కేసీఆర్‌ తిట్టగానే అందరూ దాని గురించే మాట్లాడుతున్నార‌ని, మోదీని చంద్రబాబు తిట్టినప్పుడు వారంతా ఏం చేశార‌ని క‌న్నా ప్ర‌శ్నించారు. టీడీపీ నేత‌లు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని క‌న్నా వార్నింగ్ ఇచ్చారు. జీవీఎల్‌ నరసింహారావును టీవీ లైవ్ లో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ పచ్చిబూతులు తిట్టారని, ఒక ఎంపీ అయి ఉండి అలాంటి భాష ఉప‌యోగించ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు.

టీడీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నార‌ని, వారికి కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిప‌డ్డారు. శవాల మీద చిల్ల‌ర‌ ఏరుకునే వారిలా టీడీపీ నేతల ప్రవర్తన ఉందని క‌న్నా అన్నారు. కేంద్రాన్ని తిట్టి సీఎం బాధ్యతల నుంచి తప్పుకోవాలని చంద్ర‌బాబు చూస్తున్నారని మండిపడ్డారు. తిత్లీ విపత్తును కూడా రాజకీయం చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దేన‌న్నారు. ఎప్ప‌టిలాగే చంద్ర‌బాబుకు కన్నా 5 ప్ర‌శ్న‌లు సంధించారు. పల్నాడులో అక్రమ మైనింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించుకోగలరా ? అని ప్ర‌శ్నించారు. ఎస్టిమేషన్లు పెంచి సీఎం రమేశ్‌కు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయ‌న నిల‌దీశారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బా రెడ్డిలను కూర్చోబెట్టి వాటాలు పెంచుకోమని చెప్పలేదా? అని ఆయ‌న సూటిగా అడిగారు. రూ.480 కోట్ల రూపాయలతో నిరుద్యోగులకు ఇచ్చే శిక్షణకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడంలో అంతర్యం ఏమిటి? అని క‌న్నా ప్ర‌శ్నించారు. ఐటీ దాడులు చేస్తే రాష్ట్రంలో భావోద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు అని ఆయ‌న చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.