Begin typing your search above and press return to search.

బాబు నీళ్లు న‌మిలేలా క‌న్నా ఐదు క్వ‌శ్చ‌న్స్

By:  Tupaki Desk   |   19 Sep 2018 8:52 AM GMT
బాబు నీళ్లు న‌మిలేలా క‌న్నా ఐదు క్వ‌శ్చ‌న్స్
X
నిద్ర లేచింది మొద‌లు ప‌డుకునే వ‌ర‌కూ త‌నంత నిజాయితీ ప‌రుడు.. శుద్ద‌పూస ప్ర‌పంచంలోనే ఎవ‌రూ ఉన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇవ్వ‌టంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ర్వాతే ఎవ‌రైనా. అమ‌రావ‌తిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యం నిర్మాణంలో చోటు చేసుకున్న ప్ర‌జాధ‌నం వృధాపై కాగ్ క‌డిగిపారేసిన వైనం తెలిసిందే.

బాబు పాల‌న‌లో ఎక్క‌డ ట‌చ్ చేసినా.. అవినీతి.. త‌మ‌కు అయిన వాళ్లకు దోచి పెట్టిన తీరుకొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది. బాబు పాల‌న‌లో భారీగా అవినీతి చోటు చేసుకుంద‌న్న ఆరోప‌ణ‌లు జోరుగా వినిపిస్తున్న వేళ‌.. తాజాగా ఏపీ బీజేపీ ర‌థ‌సార‌ధి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ స్వరం పెంచారు.

గ‌డిచిన కొద్ది రోజులుగా విడ‌త‌ల వారీగా బాబు అవినీతిపై క్వ‌శ్చ‌న్లు అడుగుతున్న క‌న్నా.. తాజాగా మ‌రో ఐదు ప్ర‌శ్న‌ల్ని సంధించారు. మీకు ద‌మ్ముంటే.. తాను సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు బాబు చెప్ప‌గ‌ల‌రా? అని సూటిగా అడిగేస్తున్నారు. తాజాగా క‌న్నా ప్ర‌శ్నాస్త్రాల్లో త‌న బావ‌మ‌రిది క‌మ్ వియ్యంకుడైన బాల‌కృష్ణ వియ్యంకుడికి బాబు చేసిన ఫేవ‌ర్ మీద ఒక ప్ర‌శ్న ఉండ‌టం గ‌మ‌నార్హం. ఆస‌క్తిక‌రంగా మారిన క‌న్నా ఐదు క్వ‌శ్చ‌న్లను చూస్తే..

1. ‘విశాఖపట్నం మధురవాడలో మీ కుమారుని మిత్రుడైన జి శ్రీధర్‌ రాజుకు 360 కోట్ల రూపాయల విలువైన భూమిని 25 కోట్ల రూపాయలకు కట్టబెట్టలేదా?. ఏపీఎల్ ఎమ్ ఏ - సర్వే నంబర్ 409లో ఉన్న భూమికి ఎకరం విలువ 7.26 కోట్ల రూపాయలుగా నిర్ణయిస్తే.. మీ కేబినెట్‌ దానిని 50 లక్షల రూపాయల ధర నిర్ణయించలేదా? ఇందులో మీకు, మీ కుమారునికి ముడుపులు అందలేదని చెప్పగలరా’?

2. ‘వ్యవసాయ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే 7 శాతం వడ్డీలో కేంద్రం తన 3 శాతం చెల్లిస్తూండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతాన్ని గత నాలుగేళ్లుగా చెల్లించని మాట వాస్తవం కాదా? దీంతో బ్యాంకులు ఆ మొత్తాన్ని పేద రైతుల నుంచి బలవంతగా వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా? ఆ బకాయిలను ఎప్పటిలోగా చెల్లించి రైతులకు ఉపశమనం కలిగిస్తారు?

3. ‘కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో సర్వే నంబర్‌ 93లోని 499 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ కు ధారదత్తం చేయలేదా?. ఆ కంపెనీ మీ బావమరిది - హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకునికి చెందినది కాదా? ఈ కేటాయింపులో అవకతవకలు జరగలేదని శ్వేత పత్రం విడుదల చేయగలరా’?

4. ‘కేంద్రం రాష్ట్రానికి విద్యాసంస్థలు ఇవ్వడం లేదని చెబుతున్న మీరు.. 2016 డిసెంబర్‌ లో కేంద్ర మంత్రులు శంకుస్థాన చేసిన ఎస్‌సీఈఆర్‌టీకి ఎందుకు భూమి ఎందుకు కేటాయించలేదో ప్రజలకు వివరించగలరా’?

5. ‘ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం మేజర్‌ పోర్టుకు ఎప్పుడో రైట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అనుకూలంగా రిపోర్టు ఇచ్చినా.. ప్రైవేటు రంగంలో మైనర్‌ పోర్టుకు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ప్రజలకు వివరించగలరా. వెనుకుబడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేసే విషయంలో ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు’?