Begin typing your search above and press return to search.

`ఆంధ్ర అప‌రిచితుడు` చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   4 Jun 2018 12:25 PM GMT
`ఆంధ్ర అప‌రిచితుడు` చంద్ర‌బాబు
X
ఏపీ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ - ఏపీ సీఎం చంద్రబాబుల మ‌ధ్య కొంత‌కాలంగా మాట‌ల యుద్ధం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మహానాడులో క‌న్నాపై చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీకి క‌న్నా అద్దె మైకుగా - వైసీపీకి సొంత మైకుగా తయారయ్యారనని ఎద్దేవా చేశారు. పదవుల కోసం కక్కుర్తిపడి రాష్ట్రానికి క‌న్నా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం జోలికి ఎవ‌రొచ్చినా వదిలిపెట్టే ప్ర‌స‌క్తే లేదని చంద్రబాబు క‌న్నానుద్దేశించి అన్నారు. ఆ వ్యాఖ్య‌ల‌కు క‌న్నా ఘాటుగా స్పందించారు. టీడీపీది మహానాడు కాదని, మాయనాడని కన్నా మండిప‌డ్డారు. నాలుగేళ్లలో ఏపీలో ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి అద్దె మైకుగా చంద్రబాబు తయారయ్యారని మండిప‌డ్డారు. ఓ ప‌క్క అవినీతి...మరోపక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్ర‌జ‌ల‌కు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. `ఆంధ్ర అప‌రిచితుడు`అని చంద్ర‌బాబుకు క‌న్నా బిరుదు కూడా ఇచ్చారు. తాజాగా, మ‌రోసారి వీరిద్దరు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకున్నారు. బీజేపీ కుట్రలు చేస్తోందన్న చంద్ర‌బాబు వ్యాఖ్యలపై కన్నా నిప్పులు చెరిగారు. చంద్రబాబు అతి తెలివితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, 2019లో రాష్ట్రంలో - కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుంద‌న్నారు.

రాష్ట్రానికి బీజేపీ నిధులివ్వకపోయినా తాము అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి అభివృద్ధి చేస్తున్నామ‌ని, బీజేపీ కుట్రలు ఎండ‌గ‌ట్టేందుకు ధర్మపోరాటం చేస్తున్నామని చంద్ర‌బాబు అన్నారు. త‌మ‌పైకి అందరినీ బీజేపీ రెచ్చగొడుతోంద‌ని, ఏపీని అతలాకుతలం చేయాలని బీజేపీ య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ రాదని, ప్రాంతీయ పార్టీలే చ‌క్రం తిప్పుతాయ‌ని జోస్యం చెప్పారు. దేశ రాజ‌కీయాల్లో పెను మార్పుల‌కు టీడీపీ కృషి చేస్తుందన్నారు. బాబు వ్యాఖ్య‌ల‌పై క‌న్నా ఘాటుగా రిటార్ట్ ఇచ్చారు. వైసీపీ - జనసేన పార్టీలతో బీజేపీకి చంద్ర‌బాబు అక్రమసంబంధం అంట‌గ‌డుతున్నార‌ని, బీజేపీపై దుష్ప్ర‌చారం చేస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో చంద్ర‌బాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదు గ‌న‌కే ఈ త‌ర‌హా అతితెలివి ప్రదర్శిస్తున్నారని మండిప‌డ్డారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఏపీతో పాటు కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంద‌ని కన్నా అన్నారు.