Begin typing your search above and press return to search.

కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన హోదా మాట!

By:  Tupaki Desk   |   7 Sep 2016 11:47 AM GMT
కన్నా లక్ష్మీనారాయణ చెప్పిన హోదా మాట!
X
ఏపీకి ప్రత్యేక హోదానా లేక ప్రత్యేక ప్యాకేజా అదీ గాక కొత్తగా చెబుతున్న హోదా స్థాయి ప్యాకేజీ నా? ఈ విషయంపై నరాలు తెగే ఉత్కంఠకు గురవుతున్నారు ఏపీ వాసులు. ఈ రోజు ఉదయం నుంచి అదిగో ప్రకటన - ఇదిగో ప్రెస్ మీట్, అదిగో సీఎం కు కేంద్రం నుంచి ఫోన్ వచ్చింది.. ఇదిగో సుజనా చౌదరి ప్రెస్ మీట్ పెట్టారు.. ఇలా సాగిపోతుంది. ఈ విషయం సూపర్ డూపర్ హిట్ సినిమా క్లైమాక్స్ ని తలదన్నేలా ఉదయం నుంచి వాతావరణం ఉంది. ఒక వర్గం మీడియా అద్భుతమైన ప్యాకేజీతో కేంద్రం సిద్దంగా ఉంది, సీఎం వెళ్లి ఆ ప్యాకెట్ తెచ్చుకోవడమే లేటు అన్నట్లు వ్యవహరిస్తుంటే - మరో వర్గం మీడియా అయితే.. హోదాకు మించింది లేదని - ప్యాకేజీ కీ హోదాకీ దయచేసి ముడిపెట్టొద్దని వాదిస్తున్నాయి. ఈ క్రమంలో హోదాపై ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే వాటిని క్లారి ఫై చేసేస్తున్నారు బీజేపీ నేత లక్ష్మీ నారాయణ.

ప్రత్యేక హోదాపై బీజేపీ నాయకుడు - మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఒక విషయం తెగేసి చెప్పారు. ఇక నుంచి దేశంలో ఏ రాష్ట్రానికీ (ఏపీతో కలిపి కావొచ్చు) ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు అని కన్నా లక్ష్మీనారయణ తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజి విషయమై జరుగుతున్న హడావుడి నేపథ్యంలో గుంటూరులో మీడియాతో మాట్లాడిన కన్నా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కంటే అధికంగా కేంద్రం నిధులిస్తుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు ఇస్తే దానికి కూడా కేంద్రం నిధులు ఇస్తుందని చెబుతూ.. ఇప్పటికే ఏపీకి కేంద్రం రూ. 1.40 లక్షల కోట్ల సాయం చేసిందని తెలిపారు.

ఏది ఏమైనా.. ఈ విషయంలో బీజేపీ నేతలకు బాగానే క్లారిటీ ఉంది.. లేనిదెల్లా ప్రత్యేక హోదా వచ్చేస్తుంది, చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు - వెంకయ్య ఇప్పటికే చాలా పోరాడారు - సుజనా చౌదరి కూడా గవర్నర్ ను కలిసింది ఇందుకే అని నమ్ముతున్న ఏపీ వాసులకేనేమో!