Begin typing your search above and press return to search.

ఇన్ సైడ్ టాక్..‘కన్నా’ ఏమనుకుంటున్నారు.?

By:  Tupaki Desk   |   14 May 2018 4:07 AM GMT
ఇన్ సైడ్ టాక్..‘కన్నా’ ఏమనుకుంటున్నారు.?
X
ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్న బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణను ఎంపిక చేసింది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అంటూ బీజేపీలో రెచ్చిపోతున్న సోము వీర్రాజుకు షాక్ ఇస్తూ కన్నాకు పీఠం కట్టబెట్టింది. చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ లో వెలుగు వెలిగిన కన్నా అయితే కరెక్ట్ అని బీజేపీ భావిస్తోంది. అయితే చంద్రబాబును ఎదుర్కొంటూ ఏపీలో బీజేపీని లీడ్ చేయడం తలకు మించిన భారం అని కన్నాకు తెలియంది కాదు..

కొద్దిరోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ హరిబాబు రాజీనామా చేశాక బీజేపీ అధ్యక్ష పీఠం ఎవరికి కట్టబెట్టాలనేదానిపై బీజేపీ తీవ్రం గా శోధించింది. సోము వీర్రాజు దాదాపు కన్ఫం అనుకుంటున్న వేళ.. ఆయన ఒంటెత్తు పోకడలు పార్టీకి కీడు చేస్తాయని వ్యూహంతో, సమన్వయంతో వ్యవహరించే వారినే రాష్ట్ర అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టాలని బీజేపీ నాయకులు బీజేపీ అధిష్టానంకు సూచించారట.. దీంతో ఇన్నాళ్లు ఆలోచించిన అమిత్ షా.. కర్ణాటక ఎన్నికలు ముగియగానే కన్నాకు ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు..

కన్నాకు కూడా ఈ పదవి తీసుకోవడం అంతర్గతంగా అంత సంతృప్తినివ్వలేదని ఆయన సన్నిహితుల నుంచి సమాచారం.. నిజానికి కన్నా మొన్నీ మధ్యే వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నారు. కానీ బీజేపీ పెద్దలు కన్నాని వదులుకోకుండా నానా రకాల ప్రయత్నాలు చేశారు. వేరే పార్టీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. చివరికి కన్నా చేసేందేం లేక అయిష్టంతోనే బీజేపీ పగ్గాలు పట్టుకున్నట్టు తెలిసింది..

ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు.. రాష్ట్రాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ ఎంత మోసం చేసిందో.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ అదే మోసాన్ని చేసిందనేది ప్రజల్లోకి బాగా వెళ్లింది. కాంగ్రెస్ గతే బీజేపీకి పడుతుందని ఆ పార్టీ నాయకుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. కత్తి మీద సాములా ఉన్న బీజేపీ పరిస్థితులను చూసే కన్నా అంతగా ఇష్టపడలేదు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో ఆయన ఎలా లీడ్ చేస్తారు.. బీజేపీని ఏపీలో ఎలా అధికారంలోకి తెస్తాడనేది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.