Begin typing your search above and press return to search.

జంపింగ్- ప్రత్తిపాటి పుల్లారావుకు అడ్డుపుల్ల ఎవరు?

By:  Tupaki Desk   |   9 July 2019 6:01 AM GMT
జంపింగ్- ప్రత్తిపాటి పుల్లారావుకు అడ్డుపుల్ల ఎవరు?
X
మాజీ మంత్రి - టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొద్దికాలంగా సాగుతోంది. అయితే.. ప్రత్తిపాటి మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. తాను బీజేపీలోకి వెళ్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు అటువంటి ఆలోచన ఏదీ లేదన్నారు.

తాను మాత్రమే కాదని - అసలు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త కూడా బీజేపీలోకి వెళ్లడం లేదని ప్రత్తిపాటి చెప్పుకొచ్చారు. ఈ పుకార్లు అన్నీ వైసీపీ మైండ్ గేమ్‌ లో భాగమేనన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఇప్పుడు ఎగిరి పడుతున్న అందరికీ రానున్న జమిలి ఎన్నికలే సమాధానం చెబుతాయని ప్రత్తిపాటి అన్నారు.

బీజేపీలో చేరికను ప్రత్తిపాటి ఖండించినప్పటికీ ఆయన శుద్ధపూసేమీ కాదంటున్నారు గుంటూరు టీడీపీలోని ఓ వర్గం నేతలు. బీజేపీలోకి వెళ్లడానికి ప్రత్తిపాటి ప్రయత్నించడం వాస్తవమేనని.. అయితే, గుంటూరుకే చెందిన బీజేపీ కీలక నేత ప్రత్తిపాటి రాకను ఇష్టపడడం లేదని చెబుతున్నారు.

ఏ స్థాయి నాయకుడు వచ్చినా కూడా చేర్చుకోవాలని బీజేపీ అధిష్ఠానం చాలా క్లియర్‌ గా చెప్పినప్పటికీ ప్రత్తిపాటి లాంటి సమర్థుడైన నాయకుడిని చేర్చుకోవడానికి ఇష్టపడని బీజేపీ నేత ఎవరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ బీజేపీ నేత ఎవరో కాదట... పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణే ప్రత్తిపాటి చేరికను అడ్డుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

కన్నా - ప్రత్తిపాటి ఇద్దరిదీ ఒకే జిల్లా కావడం... ప్రత్తిపాటికి చురుగ్గా అల్లుకుపోయే స్వభావం ఉండడంతో ఆయన వస్తే పార్టీలో తన కంటే బలపడే ప్రమాదముందని.. అది తనకు భవిష్యత్తులో అవకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనతోనే కన్నా అడ్డుకుంటున్నారని టాక్.

కన్నాతో సంబంధం లేకుండా కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి వారి సమక్షంలో పార్టీలో చేరాలని ప్రత్తిపాటి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. అమిత్ షా వంటి నేతల బిజీ షెడ్యూళ్ల కారణంగా ఇంకా ప్రత్తిపాటికి చాన్సు రాలేదని... దాంతో ప్రస్తుతానికి తాను వెళ్లడం లేదన్నట్లుగా ప్రత్తిపాటి సంకేతాలిస్తున్నట్లు చెబుతున్నారు.