Begin typing your search above and press return to search.

ఇక చంద్రబాబుకు ప్రతివారం పరీక్షే..

By:  Tupaki Desk   |   5 July 2018 4:31 AM GMT
ఇక చంద్రబాబుకు ప్రతివారం పరీక్షే..
X
ఏపీ రాజకీయాల్లో ఏకాకి అయిపోయిన చంద్రబాబు నాయుడికి కొత్త పరీక్ష మొదలవుతోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వేస్తున్న ప్రశ్నలకు... జనం అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోతున్న చంద్రబాబు ఇక కొత్తగా మరిన్ని ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగేళ్ల పాలనలో ఏం సాధించారు బాబూ అంటే ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు మరి.. ఈ ప్రశ్నలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

నాలుగేళ్ల పాలనలో వైఫల్యాలు - అవినీతిపై ప్రతి వారం ఐదు ప్రశ్నలతో సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖలు రాయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించారు. ఇందుకుగాను చంద్రబాబు నాలుగేళ్ల పాలనను ఇప్పటికే పూర్తిస్థాయిలో సమీక్షించుకుని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేశారట. ఇందులో భాగంగా మొట్టమొదట ఐదు ప్రశ్నలను సంధిస్తూ బుధవారం ఆయన సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు.

ఇవీ ఆ 5 ప్రశ్నలు..

- 2014 ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ వెబ్‌ సైట్‌ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్పాలి. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే అలా చేశారా ?

- అధికారంలోకి వచ్చిన తొలిరోజు సంతకాలు చేసిన రైతు - డ్వాక్రా రుణమాఫీ - బెల్టుషాపుల మూత - ప్రతి ఇంటికీ శుభ్రమైన తాగునీరు పంపిణీ హామీల అమలు తీరేమిటి ? వీటిని అమలు చేయలేదనే విషయాన్ని మీ ధర్మపోరాట దీక్షలో ప్రజలకు వివరించి - వారికి క్షమాపణ చెప్పే ధైర్యం మీకు ఉందా?

- ఓటుకు కోట్లు వ్యవహారంలో నిజాలను ప్రజలకు వివరించి, మీరూ, మీ పార్టీ ఏ నేరానికి పాల్పడలేదని ఒక బహిరంగ ప్రకటన చేయగలరా? ఫోను సంభాషణలో బయటపడ్డ ‘బ్రీఫ్డ్‌ మీ’ అన్న మాటలు మీవి కాదని ప్రజలకు చెప్పగలరా?

- గ్రామ పంచాయతీ - మండల ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయిన నేతలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి.. ప్రతి పథకం వారి ద్వారా అమలు చేయిస్తూ కమీషన్లు - లంచాలు చెల్లిస్తే గానీ సంక్షేమ కార్యక్రమాలు అందని పరిస్థితి కల్పించింది నిజం కాదా?

- విశాఖ భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. వాటన్నింటిపై వాస్తవాలను ప్రజలకు బహిర్గతం చేసే ధైర్యం ఉందా? అని సీఎంను నిలదీశారు.