Begin typing your search above and press return to search.

పోల‌వ‌రంపై బీజేపీ వార్ మొద‌లైందా..?

By:  Tupaki Desk   |   14 Oct 2019 5:33 AM GMT
పోల‌వ‌రంపై బీజేపీ వార్ మొద‌లైందా..?
X
పోల‌వ‌రం ప్రాజెక్టు అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌ గా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార‌ - ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను ఇరుకున పెట్టి - రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు పోల‌వ‌రం ప్రాజెక్టు ను అస్త్రంగా వాడుకునేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. తాజాగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్ వ్యాఖ్య‌లు వీటికి అద్దంప‌డుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరలో పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ఆయ‌న స్పష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో పార్టీ నేతలు రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన విషయం తెలిసిందే. ఈ మేర‌కు ఆదివారం రాత్రి ఢిల్లీలోని మంత్రి షెకావత్‌ నివాసంలో కన్నాతో పాటు బీజేపీ ప్రతినిధులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో తాము గమనించిన అంశాలతో కూడిన నివేదికను కేంద్ర మంత్రికి సమర్పించారు. పోలవరంపై గత ప్రభుత్వం - నేటి ప్రభుత్వం చూపిన అలసత్వంపై ఫిర్యాదు చేశారు. దాదాపు గంటసేపు ఈ భేటీ కొనసాగింది. అనంతరం మంత్రి షెకావత్‌ మీడియాతో మాట్లాడారు.

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంద‌ని చెప్పారు. రివర్స్‌ టెండర్ల పేరుతో పనులు నిలిపివేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూడరాదని - మోదీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే ఎక్కడా అవినీతికి చోటు లేకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించబోమన్నారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో సహా ఇతర అంశాలకు సంబంధించిన వివరాలేమీ కేంద్రం వద్ద లేవన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదన్నారు. ఏపీ ప్రభుత్వ స్పందనను బట్టి కేంద్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకుంటుందని షెకావ‌త్ స్ప‌ష్టం చేశారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేవలం పర్యాటక ప్రాంతంగా చూసిందని - త్వరగా పూర్తిచేయాలనుకోలేదని విమర్శించారు. అయితే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రధాని మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ పోలవరం ప్రాజెక్టును రాజకీయకోణంలోనే చూస్తున్నాయని విమర్శించారు.

ఓవ‌రాల్‌ గా చూస్తే అప్పుటు టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు నిధులు విద‌ల్చ‌కుండా పోల‌వ‌రంపై విమ‌ర్శ‌లు చేసిన బీజేపీ... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చినా సేమ్ అదే తీరుతో వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్త‌య్యేంద‌కు కావాల్సిన నిధులు రిలీజ్ చేయ‌రు.. అదే టైంలో ప్రాజెక్టు ప‌నులు పూర్త‌వ్వ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు చేస్తుంటారు. అంటే పోల‌వ‌రం పేరుతో బీజేపీ రాజ‌కీయం చేస్తూ ప‌బ్బం గ‌డుపుకుంటుందే త‌ప్పా నిజంగా ప్రాజెక్టు పూర్తి చేసే విష‌యంలో వాళ్ల‌కు ఎంత మాత్రం చిత్త‌శుద్ధి లేద‌ని అర్థ‌మ‌వుతోంది.