Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో కోల్డ్ వార్!

By:  Tupaki Desk   |   30 July 2019 5:37 PM GMT
ఏపీ బీజేపీలో కోల్డ్ వార్!
X
ఆంధ్రప్రదేశ్‌ లో అవకాశాల వేట సాగిస్తున్న బీజేపీలో అప్పుడే ఆధిపత్య పోరు మొదలైపోయింది. కలిసికట్టుగా పనిచేసి ప్రజల్లో పట్టు పెంచుకోవాల్సిన సమయంలో ఎవరికి వారు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ భవిష్యత్తులో పార్టీకి దశ తిరిగితే తాము కీలక పదవులు చేపట్టాలనే యోచనతో అందుకు పోటీ అనుకుంటున్న నేతలతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. సమన్వయం - సయోధ్య లేకుండా నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతున్నారు.

రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో చేరిన కన్నా లక్ష్మీ నారాయణ ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత టీడీపీ నుంచి సుజనా చౌదరి - సీఎం రమేశ్ వంటివారు వచ్చి బీజేపీలో చేరారు. ముఖ్యంగా కన్నా - సుజనాల మధ్య ఏమాత్రం పొసగడం లేదట. సుజనా - సీఎం రమేశ్‌ లు బీజేపీలో చేరిన తరువాత ఇంతవరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా నైనా కలవలేదట. వీరిద్దరూ దిల్లీలోని పార్టీ పెద్దలకు సన్నిహితమవుతూ పట్టు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అది కన్నా లక్ష్మీనారాయణకు రుచించడంలేదట. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా వారు పార్టీలో అల్లుకుపోతుంటే తాము వెనుకబడిపోతున్నామని కన్నా మథనపడుతున్నారట.

ఇదే సమయంలో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం బీజేపీలో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అదే జరిగితే సుజనాకు మంత్రి పదవి ఖాయమనే చెప్పాలి. అప్పుడు ఆయన మరింతగా పట్టు బిగించే అవకాశం ఉంటుంది. కన్నాను ఆ ఆలోచన భయపెడుతోందని.. పార్టీ కోసం గత అయిదేళ్లుగా తాను కష్టపడితే ఇప్పుడొచ్చి సుజనా పదవులు తన్నుకుపోతున్నారని కన్నా ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్రం టార్గెట్ పెట్టి ఏపీలో బీజేపీని గెలిచేలా చేస్తే సీఎం కావాలని కన్నా - సుజనా ఇద్దరూ ఆశలు పెట్టుకున్నట్లుగా చెబుతున్నారు. ఆ కారణంతోనే ఇద్దరి మధ్యా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందని టాక్.