Begin typing your search above and press return to search.

ఏపీ బీజేపీలో అనూహ్య నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   29 March 2018 12:23 PM GMT
ఏపీ బీజేపీలో అనూహ్య నిర్ణ‌యం!
X
భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉందో ప్ర‌తి ఒక్క‌రికీ క్లారిటీ ఉంది. అయితే, తాజాగా బీజేపీ నాయ‌కుల‌కు కూడా ఈ క్లారిటీ వ‌చ్చిన‌ట్టు కొన్ని సంకేతాలు క‌నిపిస్తున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు కేబినెట్లో మంత్రిగా చేసిన‌ పైడి కొండ‌ల మాణిక్యాల రావుపై అధ్య‌క్షుడి రేసులోకి రావ‌డ‌మే ఆ సంకేతం. ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారాల‌న్నీ ఆ పార్టీ ఏపీ ఇన్‌ఛార్జ్ రాంమాధ‌వ్ చూస్తున్నారు. బీజేపీకి-టీడీపీకి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో బాబు దుమ్ముదులిపే అవ‌కాశం వ‌స్తే అస‌లు వ‌దులుకోని నేత‌కు ప‌గ్గాలు ఇస్తారేమో అని అంద‌రూ అనుకుంటున్నారు. సోము కాక‌పోయినా... ఇంకా పార్టీలో వేరే వాళ్లు ఉన్నారు. కాక‌పోతే ఆంధ్ర‌లో స్ట్రాంగ్‌ గా ఉన్న కాపుల‌పైనే పార్టీ దృష్టిపెడుతోంది. దీన్ని బ‌ట్టి చూస్తే పైడికొండ‌ల మాణిక్యాల రావు కంటే కూడా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ పేరు ముందు విన‌ప‌డాలి. కానీ బాబుతో చాలా మ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రించే మాణిక్యాల రావు పేరు మొద‌టి వ‌రుస‌లో క‌నిపిస్తున్న‌ట్లు ఫీల‌ర్లు రావ‌డం వింతే. సోము లాంటి హార్డ్ క్యారెక్ట‌ర్ ఇపుడు వారికి నాయకుడిగా ఎందుకు ప‌నికి రాడ‌బ్బా? అని ఆలోచిస్తే భ‌విష్య‌త్తులో ఏదో కొత్త కొత్త వ్యూహాలు-కొత్త స్నేహాలు మొల‌కెత్తే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఈ నేపధ్యంలోనే ఆయన స్ధానంలో మాణిక్యాల రావును నియమించేందుకు నిర్ణయం తీన్నారని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.

ఇక అధ్య‌క్ష ప‌ద‌విని ఈ త‌రుణంలో మారడానికి కార‌ణాలు చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇపుడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా ఉన్న హ‌రిబాబు చంద్ర‌బాబుకు సానుకూల మ‌నిషి. ఈరోజు ప‌రిస్థితి చెడినా ఎందుకైనా మంచిద‌ని మార్పును ఆహ్వానిస్తున్నారు. మ‌రోవైపు హ‌రిబాబు ఇత‌ర‌ పార్టీల దాడిని స‌రిగ్గా ఎదుర్కోలేక‌పోతున్నాడ‌నే నింద కూడా ఉంది. జ‌న‌సేన‌ - కాంగ్రెస్‌ - వైసీపీ - టీడీపీ త‌దిత‌ర పార్టీల‌కు వేగంగా - స్ట్రాంగ్ గా కౌంట‌ర్ ఇవ్వ‌గ‌లిగినంత యాక్టివ్ గా హ‌రిబాబు లేరు. అస‌లు మొన్న టీడీపీ అల‌య‌న్స్ తెగిన‌పుడు ఎవ‌రెవ‌రో తెర‌మీద హైలెట్ అయ్యారు గాని హ‌రిబాబు అంత‌గా క‌నిపించ‌లేదు. ఎల‌క్ష‌న్ స‌మ‌యంలో క్యాడ‌ర్‌ ను ఉత్సాహ ప‌రచాలంటే హ‌రిబాబు స‌రిపోడ‌న్న‌ది బీజేపీ పెద్ద‌ల మ‌నోగతం అని అర్థ‌మ‌వుతోంది.

అధ్య‌క్ష నియామ‌క చ‌ర్య‌లు చాలా వేగంగా సాగుతున్నాయి. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నేపథ్యంలో రాంమాధవ్‌ బీజేపీ ముఖ్య నేతలతో గురువారం హైదరాబాద్‌ లో సమావేశమయ్యారు. ఎవ‌రైతే ఎలా నిల‌బ‌డ‌గ‌ల‌రు అనే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. రేసులో ఉన్న వారి స‌మ‌ర్థ‌త పై సీనియర్‌ నాయకుల అభిప్రాయాలను స‌మీక‌రిస్తున్నారు.