Begin typing your search above and press return to search.

కన్నా కన్నీరు.. కరిగేనా మోదీగారు

By:  Tupaki Desk   |   1 Nov 2019 10:30 AM GMT
కన్నా కన్నీరు.. కరిగేనా మోదీగారు
X
బీజేపీ రాజకీయాలతో ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారట. జాతీయ పార్టీలో చేరానన్న పేరే తప్ప ప్రత్యేకంగా ఒరిగిందేమీ లేదని.. పార్టీ అధ్యక్షుడిగా అన్ని బాధ్యతలూ పైన వేసుకుని పనిచేయడమే కానీ ఫలితం ఉండడం లేదని వాపోతున్నారట. పైగా పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందని కూడా ఆయన జేబులు తడుముకుంటున్నట్లు సమాచారం.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుదేలైన తరువాత వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నించిన సమయంలో బీజేపీయే తనను పిలవడంతో ఏదైనా మంచి పదవి దొరుకుతుందన్న ఆశతో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంతో పాటు కేంద్ర కార్పొరేష‌న్ లేదా? వేరే రాష్ట్రాల నుంచి రాజ్యసభకైనా పంపుతామని అప్పట్లో తనకు హామీ ఇచ్చారని ఆయన అంటున్నారట. మొన్నటి ఎన్నికల్లో నరసారావుపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తరువాతయినా పార్టీ తనకు న్యాయం చేస్తుందన్న ఆశతో ఉన్నా ఇంతవరకు ఆ ఊసే లేదని ఆయన ఆవేదన చెందుతున్నారట.

తనతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎంచక్కా మంత్రి పదవిలో ఉండడం కూడా కన్నాను మరింత క్షోభ పెడుతున్నట్లు టాక్. అలా అని ఇప్పుడు వైసీపీలోకి వెళ్దామన్నా ఇప్పటికే కిటకిటలాడుతున్న నావలోకి వెళ్లినట్లువుతుందని వెనుకాడుతున్నారు. ఎన్నికలకు ముందు కనుక వైసీపీలోకి వెళ్లుంటే మంత్రి పదవిలో ఉండేవాడినని.. ఇప్పుడు వెళ్లి లాభం లేదని.. అంతకంటే, ఇక్కడే మరికొన్నాళ్లు ఉంటే ఏదో ఒక రోజు మోదీ కరుణిస్తారని ఆయన ఆశ పడుతున్నారట.

అయితే, కన్నాకు ఇంకా బీజేపీ అధిష్ఠానం ఏదో చేస్తుందని ఆశ చావనప్పటికీ అధిష్ఠానం వద్దకు మాత్రం ఆయనకు వ్యతిరేకంగా నిత్యం ఫిర్యాదులు వెళ్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన బ్యాచ్ కన్నాను కేర్ చేయడం లేదు. అంతేకాదు.. తెలంగాణతో సమానంగా ఏపీ నుంచి ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలన్నా కూడా దానికి కన్నా కంటే ముందే సుజనా చౌదరి, పురంధేశ్వరి వంటివారు కర్చీఫ్ వేసి ఉన్నారు. దీంతో కన్నా పరిస్థితి ఉండీ లాభం లేదు.. వెళ్లీ లాభం లేదు అన్నట్లుగా ఉందట.