Begin typing your search above and press return to search.

హీరోయిన్ మాకొద్దంటున్న కన్నడ కాంగ్రెస్

By:  Tupaki Desk   |   21 July 2015 10:36 AM GMT
హీరోయిన్ మాకొద్దంటున్న కన్నడ కాంగ్రెస్
X
కన్నడ నటి అయినప్పటికీ తమిళం, తెలుగుల్లోనూ కుర్రకారుకు పరిచయమున్న హీరోయిన్ రమ్య రాజకీయంగానూ పాపులరే. ఆమె కన్నడనాట ఎంపీగానూ పనిచేశారు. ఇప్పుడు ఈ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. కన్నడ కాంగ్రెస్ నేతలు ఆమెకు టిక్కెట్ దక్కకుండా అంతకంటే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు.

రమ్య పని తీరు సక్రమంగా లేదని, ఆమె కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఓ లేఖ రాశారు. అందులో రమ్య పనితీరుపై వారు మండిపడ్డారు. రమ్యను తమ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడో మరిచిపోయారని పేర్కొన్నారు.

రమ్య తొలిసారి మాండ్య పార్లమెంట్ ఉప ఎన్నికలలో గెలిచారు... ఆ తరువాత మొన్నటి ఎన్నికల్లో అదేస్థానం నుంచి ఓడిపోయారు. ఎన్నికల తరువాత ఆమె అసలు ఎక్కడా కనిపించలేదట... నియోజకవర్గంలో ఆమే జాడే లేదట. నాయకులకూ అందుబాటులో లేరట... అయితే కొద్ది రోజులగా ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం మాత్రం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మాండ్య నియోజకవర్గ నేతలు ఆమెపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. విదేశాలలో సంచరిస్తు హాయిగా జల్సాలు చేసిన రమ్యా మండ్య కాంగ్రెస్ నాయకులను సైతం లెక్కచెయ్యడం లేదని, అసలు సంప్రదించడం లేదని ఆరోపించారు. రమ్య అసలు భారతదేశంలో ఉన్నారా అని ప్రశ్నించారు. మాండ్య జిల్లాలో 18 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబ సభ్యులను పరామర్శించలేదని... ఆమెకు ఎమ్మెల్సీ టిక్కెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.