Begin typing your search above and press return to search.

సిద్ధరామయ్య దెబ్బ.. ఎవరిపై ఎంత?

By:  Tupaki Desk   |   24 Dec 2016 7:19 AM GMT
సిద్ధరామయ్య దెబ్బ.. ఎవరిపై ఎంత?
X
అమెరికా ఎన్నికల్లో సానుకూల ఫలితాల్నిచ్చిన స్థానికులకు ఉద్యోగాలు అన్న కాన్సెప్టు కర్ణాటక ఎన్నికల్లో అమలు చేసేందుకు సిద్దరామయ్య ప్రభుత్వం సిద్దమైంది. అమెరికా ఫలితాలు ఆ దేశంలో భారతీయుల హెచ్‌1 - బి 1 వీసాల జారీ నుంచి ఉద్యోగావకాశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాగా కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అంశాలు తెలుగు యువత ఉపాధి అవకాశాలకు గండికొట్టనున్నాయి.

ప్రస్తుతం బెంగుళూరులో 128అంతర్జాతీయ స్థాయి ఐటి పరి శ్రమలున్నాయి. ఇవికాక చిన్నాచితక ఐటి సంస్థలు మరో 528 ఉన్నాయి. వీటితో పాటు కర్ణాటక వ్యాప్తంగా మొత్తం 1514 ఐటి సంస్థలున్నాయి. వీటన్నింటిలో 5.31లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో అత్యధికులు తెలుగువారే. తమిళులు - మళయాళీలు - బెంగాలీలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నప్పటికీ మనకంటే తక్కువే.

ప్రస్తుతం కర్ణాటకలోని ఐటి సంస్థల ఉద్యోగుల్లో తెలుగువారు 17.7శాతం ఉన్నారు. ఆ తర్వాత తమిళులు 9.1శాతం ఉన్నారు. 17.7 శాతం అంటే తెలుగోళ్లు 94 వేల మంది ఉన్నట్లు. కొత్త రూలు అప్లయ్ అయితే వారంతా మూటాముల్లె సర్దుకోవాల్సిందే.

ఇతర ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల్లోకూడా తెలుగువారికి పెద్దసంఖ్యలోనే ఉపాధి అవకాశాలొచ్చాయి. తెలుగురాష్ట్రాల్లోని విద్యార్ధులు విద్యార్ధి దశ నుంచి బెంగుళూరులోని ఉపాధి అవకాశాలపై ఫోకస్‌ పెడతారు. ఆ సంస్థల్లో కొలువుల కోసం ఆరాటపడ తారు. కాగా ఇప్పుడు సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. బెంగుళూరు నగరంలోని ఐటి సంస్థలు, ఇతర సంస్థల్లోని ఉద్యోగాలన్నింటిని కేవలం కన్నడిగులకు మాత్రమే కేటాయించాలన్న నిబంధనను ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కార్మికశాఖ ఒక నివేదిక రూపొందించింది. దీనిపై త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. దీనిమేరకు బెంగళూరులో ఇకముందు ఏర్పాటయ్యే పరిశ్రమలు - ఐటి సంస్థలకు ప్రభుత్వం నుంచి స్థలాలు - ఇతర రాయితీలు పొందాలంటే ఖచ్చితంగా నూరుశాతం ఉద్యోగాల్ని కన్నడిగులకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వానికి అఫిడవిట్‌ రాసివ్వాల్సుంటుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్థలాలు - రాయితీలు అవసరంలేని పక్షంలో ఈ నిబంధన వర్తించదు. అయితే కొన్ని ప్రత్యేక అర్హతలు గల నిపుణులకు సంబంధించి వెసులుబాటు కల్పిస్తారు. ఇది అమలైతే తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉపాధి అవకాశాలకు భారీగా గండిపడినట్లే. రాయితీలు - ప్రభుత్వ భూములు పొందకుండా బెంగుళూరులో పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణా సాధ్యంకాదు. దీంతో ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలకు అంగీకరించక తప్పదు. అమెరికా ఎన్నికల్లో ఇచ్చిన నినాదం వచ్చే ఎన్నికల్లో తమక్కూడా ఓట్లు రాబడుతుందన్న ఆకాంక్షతోనే సిద్దరామయ్య ప్రభుత్వం ఈ ప్రతిపాదనను రూపొందించింది. దక్షిణాదిన కాంగ్రెస్‌కున్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకోవాలన్న పార్టీ లక్ష్యానికనుగుణంగా ఆయన ఈ కసరత్తులు చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/