Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి వస్తున్నారని ట్రాఫిక్ నిలిపేశారు.. ఆసుపత్రికి వెళుతున్న ప్రముఖురాలి మరణం

By:  Tupaki Desk   |   27 Jun 2021 4:34 AM GMT
రాష్ట్రపతి వస్తున్నారని ట్రాఫిక్ నిలిపేశారు.. ఆసుపత్రికి వెళుతున్న ప్రముఖురాలి మరణం
X
అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు రోడ్డు మీద ప్రయాణిస్తే.. సామాన్యులకు ఎంత కష్టమన్న విషయం తాజా ఉదంతం స్పష్టం చేయటమేకాదు.. ఒక ప్రముఖురాలు ఈ కారణంగా మరణించటం షాకింగ్ గా మారింది. దశాబ్దాల తర్వాత రైలెక్కిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందటంతో పాటు.. దేశ ప్రజల ప్రశంసల్ని అందుకున్న వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామం తీవ్ర విషాదం నింపటమే కాదు.. చివరకు రాష్ట్రపతి సైతం విచారం వ్యక్తం చేయాల్సి రాగా.. కాన్పూరు పోలీసు కమిషననర్ క్షమాపణలు చెప్పారు.

రాష్ట్రపతి కోవింద్ యూపీ పర్యటనలో భాగంగా ఆయన వాహన శ్రేణి వెళ్లటం కోసం కాన్పూరులో ట్రాఫిక్ నిలిపివేశారు. దాదాపు గంటకు పైనే ట్రాఫిక్ నిలిపివేయటంతో భారీగా ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. ఇదే సమయంలో భారత పరిశ్రమల సంఘం కాన్పూరు శాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు వందన మిశ్రను ఆమె భర్త ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమెను తక్షణ వైద్య సాయం కోసం ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. వారి వాహనం ట్రాపిక్ నిలిపివేత కారణంగా నిలిచిపోయింది.

తన భార్య పరిస్థితి గురించి తెలిపిన వందన భర్త గోడును కాన్పూరు పోలీసులు పట్టించుకోలేదు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లిన తర్వాత వాహన రాకపోకలకు అనుమతించారు. దాదాపు గంట పాటు నిలిచిపోయిన ట్రాఫిక్ లోచిక్కుకున్న ఆమె.. ఆసుపత్రికి వెళ్లేసరికి వైద్యులు మరణించినట్లుగా చెప్పేశారు. పోలీసుల్ని తాను ఎంతలా బ్రతిమిలాడినా వారు తమ వాహనాన్ని అనుమతించలేదని.. వారుకానీ వాహనాన్ని పంపి ఉంటే తన భార్య ప్రాణాలు నిలిచి ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉదంతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావటంతో కాన్పూర్ పోలీసు కమిషనర్ క్షమాపణలు చెప్పటంతోపాటు.. ఇందుకు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వందన అంత్యక్రియలకు జిల్లా కలెక్టర్.. పోలీసు కమిషనర్ హాజరయ్యారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి తన సందేశాన్ని బాధిత కుటుంబ సభ్యులకు పంపారు.