Begin typing your search above and press return to search.

అమెరికా వ్యక్తి హత్యలో ఇవి కీలకాంశాలు...

By:  Tupaki Desk   |   24 Feb 2017 5:22 PM GMT
అమెరికా వ్యక్తి హత్యలో ఇవి కీలకాంశాలు...
X
అమెరికాలోని కేన్సస్ రాష్ట్రంలోని ఒక బార్‌లో జరిగిన చిన్న వాగ్వాదం కాల్పులకు దారి తీసి ఇద్దరు తెలుగు యువకులు తీవ్రంగా గాయపడగా, అందులో ఒకరు మరణించిన సంగతి తెలిసిందే.ఒలేటా పట్టణంలోని ఆస్టిన్స్ బార్‌ లో శ్రీనివాస్ కూచిభొట్ల - అలోక్ మాడసానిపై 50 ఏళ్ల శ్వేతజాతీయుడు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో తెలుగు యువ‌కుడు శ్రీ‌నివాస్ ప్రాణాలు కోల్పోయాడు.

కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బార్ లో పనిచేసిన వారు ఇచ్చిన సమాచారం మేరకు వేగంగా పట్టుకోగలిగామని పోలీసులు వివరించారు. ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

-ఈ జాత్య అహంకార చర్యపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది. దురహంకార చర్యల్లో భాగంగా ఈ హత్య జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యపై ప్రభుత్వం స్పందించాలని కోరింది.

-కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్ సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాల్పుల ఘ‌ట‌న త‌న‌ను షాక్‌ కు గురిచేసింద‌న్నారు. శ్రీ‌నివాస్ కుటుంబ‌స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు సుష్మా ట్వీట్‌ లో వెల్ల‌డించారు. కాల్పుల ఘ‌ట‌న అంశంపై అమెరికాలో ఉన్న భార‌తీయ దౌత్య‌వేత్త న‌వ్‌ తేజ్ స‌ర్న‌తో మాట్లాడిన‌ట్లు ఆమె చెప్పారు. ఇద్ద‌రు భార‌త దౌత్యాధికారుల‌ను కేన్స‌స్ రాష్ట్రానికి పంపిన‌ట్లు సుష్మా వెల్ల‌డించారు. షూటింగ్ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అలోక్ హాస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన‌ట్లు అంబాసిడ‌ర్ తెలిపార‌ని సుష్మా పేర్కొన్నారు.

-కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ కూచిబొట్ల హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చేశాడు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో టెక్సాస్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందాడు.

-సతీమణి సునయన శ్రీనివాస్ తోనే కేన్సస్ లోనే ఉంటున్నారు. ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భవతి.

-కాల్పుల్లో గాయపడ్డ అలోక్ వరంగల్ నగరానికి చెందినట్లు సమాచారం.

- మరోవైపు స్థానిక వాసి అయిన ఇయాన్ గ్రిల్ల‌ట్‌ ఇప్పుడు అమెరికాలో హీరో అయ్యాడు. ఈ 24 ఏళ్ల యువ‌కుడు తెలుగు యువ‌కుల్ని కాపాడేందుకు ప్రయ‌త్నించాడు. క‌న్సాస్‌ లోని ఆస్టిన్ బార్‌ లో జ‌రిగిన కాల్పుల సమయంలో అక్క‌డే ఉన్న గ్రిల్ల‌ట్ ఆగంత‌కుడి నుంచి పిస్తోల్ లాక్కునేందుకు ప్ర‌య‌త్నించాడు. కాగా, ఈ క్రమంలో శ్వేత‌జాతీయుడు ఆడ‌మ్ పురింట‌న్ జ‌రిపిన కాల్పుల్లో గ్రిల్ల‌ట్ కూడా తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. పురింట‌న్ నుంచి గ‌న్‌ ను లాగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ప్పుడు గ్రిల్ల‌ట్ ఛాతిలో, చేయికి బుల్లెట్లు దిగాయి. ప్ర‌స్తుతం అత‌ను హాస్ప‌ట‌ల్లో కోలుకుంటున్నాడు.

-నేవీ మాజీ ఉద్యోగి పురింట‌న్‌ ను అడ్డుకునేందుకు ప్రయ‌త్నించిన గ్రిల్ల‌ట్ తాను చూపిన తెగువ‌ను త‌న క‌ర్త‌వ్యంగా భావిస్తున్న‌ట్లు చెప్పాడు. ప్ర‌తి ఒక్క‌రు చేయాల్సిందే తాను చేసిన‌ట్లు చెప్పాడు. జాతి, దేశం గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌ని, మ‌నం అంద‌రం మాన‌వుల‌ని, అందుకే తెలుగు యువ‌కుల్ని ర‌క్షించేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్లు గ్రిల్ల‌ట్ తెలిపాడు. అదృష్ట‌వ‌శాత్తు గ్రిల్ల‌ట్ ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డార‌ని స్థానిక మీడియా పేర్కొంది. కాల్పుల ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అలోక్ త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు హాస్ప‌ట‌ల్‌కు వ‌చ్చిన‌ట్లు గ్రిల్ల‌ట్ చెప్పాడు.

-కుచిబొట్ల శ్రీ‌నివాస్ ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌పై కుటుంబ‌స‌భ్యులు స్పందించారు. హైద‌రాబాద్‌లో కుచిబొట్ల సోద‌రుడు మీడియాతో మాట్లాడుతూ వ‌ల‌స‌దారుల‌పై క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటున్న దేశాధ్య‌క్షుడు ట్రంప్ వ‌ల్లే ఇదంతా జ‌రిగిన‌ట్లు శ్రీ‌నివాస్ సోద‌రుడు ఆరోపించాడు. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌, స్థానిక బీజేపీ బృందాలు, తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రిస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. వీలైనంత త‌ర్వ‌గా శ్రీ‌నివాస్ మృత‌దేహాన్ని తీసుకురావాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌మ దేశం విడిచి వెళ్లాల‌ని అరుస్తూ ఓ శ్వేత‌జాతీయుడు త‌న సోద‌రుడిపై కాల్పులు జ‌రిపిన‌ట్లు ఆయ‌న తెలిపాడు.

-శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి సాయమందించేందుకు ప్రవాసులు సహా అనేక మంది పెద్ద మనసుతో స్పందించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి ఊరుకోకుండా 2,60,000 డాలర్ల(రూ. కోటి66లక్షలు) ఆర్థిక సాయాన్ని విరాళంగా సిద్ధం చేశారు. త్వరలో ఈ మొత్తాన్ని అతని కుటుంబానికి అందించనున్నారు. గో ఫండ్ మి పేరుతో ఓ పేజీని క్రియేట్ చేసి లక్షా 50వేల డాలర్లు సేకరించాలని భావించినప్పటికీ అంచనాలను మించిన స్పందన వచ్చింది. మొత్తం 7వేలకుపైగా మంది ప్రజలు విరాళాలను అందించడంతో విరాళం 2,50,000డాలర్లను దాటింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/