Begin typing your search above and press return to search.

కూచిభొట్లకు కాన్సాస్ గ‌వర్న‌ర్‌ ఘ‌న నివాళి

By:  Tupaki Desk   |   17 March 2017 9:53 AM GMT
కూచిభొట్లకు కాన్సాస్ గ‌వర్న‌ర్‌ ఘ‌న నివాళి
X
ఎన్నో ఆశ‌ల‌తో అమెరికాలో అడుగుపెట్టిన తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ఆ దేశంలో పెచ్చ‌రిల్లిన జాతి వివ‌క్ష‌కు బ‌లైపోయారు. గ‌త నెల 22న కాన్సాస్ రాష్ట్రంలోనే ఒలాతేకు చెందిన ఓ బార్‌లో స్నేహితుడు అలోక్ తో క‌లిసి ఉన్న కూచిభొట్ల‌పై అక్క‌డి జాత్య‌హంకారి ఆడ‌మ్ ప్యూరింట‌న్ విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. భార‌త్‌ నే కాకుండా యావ‌త్తు ప్ర‌పంచ దేశాల‌ను దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘ‌ట‌న‌లో కూచిభొట్ల అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా, అత‌డి స్నేహితుడు అలోక్ తో పాటు అమెరికా దుర‌హంకారి దాడి నుంచి వారిని కాపాడేందుకు రంగంలోకి దిగిన అమెరిక‌న్ గ్రిల్లాట్ గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న జ‌రిగి అప్పుడే నెల కావ‌స్తోంది. అయినా నాటి దుర్ఘ‌ట‌న‌ను ఏ ఒక్క‌రు కూడా మ‌రిచిపోలేక‌పోతున్నారు. శ్రీనివాస్ ఆవాసంగా చేసుకున్న కాన్సాస్ ప్ర‌జ‌లనైతే... కూచిభొట్ల మ‌ర‌ణం తీవ్రంగా క‌ల‌చివేస్తోంద‌నే చెప్పాలి. ఈ క్రమంలో నిన్న కాన్సాస్ రాష్ట్ర‌వ్యాప్తంగా ఇండియ‌న్‌- అమెరిక‌న్ అప్రీషియేస‌న్ డే పేరిట రోజంతా ఓ ప్ర‌త్యేక కార్యక్ర‌మాన్ని నిర్వ‌హించారు. కాన్సాస్ గ‌వ‌ర్న‌ర్ శామ్ బ్రౌన్‌ బ్యాక్ ఆధ్వ‌ర్యంలో ఆ రాష్ట్ర రాజ‌ధాని టొపెకాలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ అలోక్‌ - గ్రిల్లాట్‌ లు కూడా హాజ‌రు కాగా... పెద్ద సంఖ్య‌లో అక్క‌డ ఉన్న ఎన్నారైలు, అమెరిక‌న్లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా బ్రౌన్ బ్యాక్ మాట్లాడుతూ నాటి ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండించారు. కాన్సాస్‌ లో ఇక‌పై జాతి వివ‌క్ష‌కు తావు లేద‌ని ప్ర‌క‌టించారు. అలాంటి ఘ‌ట‌న‌ల‌ను పున‌రావృతం కానివ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించారు. భార‌తీయులు పెద్ద సంఖ్య‌లో కాన్సాస్‌ నే ఆవాసంగా చేసుకుని, రాష్ట్రానికి వ‌న్నె తెచ్చార‌ని కీర్తించారు. ఈ త‌రహా ఘ‌ట‌న‌లు త‌మ విలువ‌ల‌ను గానీ, న‌మ్మ‌కాల‌ను గానీ వ‌మ్ము చేయ‌లేద‌ని తెలిపారు. కాన్సాస్ అభివృద్దికి ఇతోదికంగా సాయ‌ప‌డుతున్న భార‌తీయుల‌ను ఇక‌పైనా ఆహ్వానిస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

త‌న దేశానికి చెందిన దుర‌హంకారి దాడి నుంచి విదేశీయుల‌ని కూడా చూడ‌కుండా కాపాడేందుకు రంగంలోకి దిగిన గ్రిల్లాట్‌ను ఆయ‌న ప్ర‌శంసించారు. గ్రిల్లాట్ తో పాటు అలోక్ కూడా త్వ‌రిత‌గ‌తిన కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా బ్రౌన్ బ్యాక్ నోట సంస్కృత శ్లోకాలు వినిపించాయి. స‌త్య‌మేవ జ‌య‌తే అన్న ప‌దాల‌ను ప్ర‌స్తావించిన ఆయ‌న‌... ఆ గొప్ప సందేశం అనుసారంగానే కాన్సాస్‌లో ఈ దినాన్ని (మార్చి 16) ఇండియ‌న్ అమెరిక‌న్ డేగా ప్ర‌క‌టిస్తున్నాన‌ని చెప్పారు. ఒక్క భార‌తీయుల‌నే కాకుండా త‌మ రాష్ట్రానికి వ‌చ్చే అన్ని దేశాల ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఆయ‌న తెలిపారు.

ఇదిలా ఉంటే... హోస్ట‌న్‌ లోని ఇండియా హౌస్‌ లోనూ కూచిభొట్ల స్మృత్య‌ర్థం నిన్న ఓ కార్య‌క్ర‌మం జ‌రిగింది. శ్రీనివాస్ జ్ఞాప‌కార్థం అక్క‌డ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మంలో పాల్గొన్న ఇండియా హౌస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ విపిన్ కుమార్ తో పాటు అక్క‌డి ఎన్నారైలు, అమెరిక‌న్లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/