Begin typing your search above and press return to search.

బాబుకు 'ఇంటి' స‌మ‌స్య‌

By:  Tupaki Desk   |   14 Sep 2016 4:53 AM GMT
బాబుకు ఇంటి స‌మ‌స్య‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాన‌స పుత్రిక అయిన ప‌థ‌కాల్లో డ‌బుల్ బెడ్రూం ఇళ్లు కీల‌క‌మైన‌ది. సికింద్రాబాద్‌ లోని ఒక్క కాల‌నీలో క‌ట్టి పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసిన‌ కేసీఆర్ ఆనక వాటిని ప‌ట్టించుకోలేద‌నే అప‌ప్రద ఉంది. వీలైన‌ప్పుడ‌ల్లా సొంత పార్టీకి చెందిన నాయ‌కులే ఈ ప‌థ‌కం అమ‌లు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇపుడు సేమ్ టు సేమ్ అదే ప‌రిస్థితి ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ఎదుర‌వుతోంది. ఏకంగా రాజ‌ధాని ప్రాంత‌మైన గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు అధికారులపై ఫైర్ అయ్యారు. ప్ర‌భుత్వ గృహ నిర్మాణ పథకాల్లో నియోజకవర్గాలకు కేటాయించటంలో న్యాయం జరగలేదని అధికార తెదేపా ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ అయితే జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు నాగశివరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా కలెక్టరు కాంతిలాల్‌ దండే అధ్యక్షతన గృహనిర్మాణాల పథకాల అమలు - నిబంధనలు - నిధులకు సంబంధించి అవగాహన కల్పించారు. పీడీ నాగశివరావు పవర్‌ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.అనంత‌రం తెనాలి ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ తన నియోజకవర్గానికి మాత్రమే 150 గృహాలను కేటాయించి మిగిలిన నియోజకవర్గలకు 350 చొప్పున ఏ ప్రాతిపదికన కేటాయించారని ప్రశ్నించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కేటాయించినట్లు పీడీ వివరణ ఇచ్చారు. ‘రాజ‌కీయంగా మాకు ఎవరూ సమాధి కట్టేవాళ్లు లేరు. హౌసింగ్‌ బోర్డు వారే సమాధి కడతారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేక‌పోతున్నాం’ అని వ్యాఖ్యానించారు. 2011 సర్వేలో పేర్లు ఉన్న వారికి మాత్రమే గృహాలను కేటాయిస్తామనటం సరికాదని - అయిదేండ్లు దాటిపోయిన త‌ర్వాత కూడా అదే నిబంధ‌న‌లు ఎలా అమ‌లు చేస్తార‌ని ఆయ‌న‌ అసహనం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ సీఎం హామీ ఇచ్చినప్పటికీ అదనంగా గృహాలను కేటాయించకపోవటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు గృహాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా రూ.2 లక్షలతో గృహాలు నిర్మిస్తామని పేర్కొంటూ తనతో బలవంతంగా శంకుస్థాపన చేయించారని - ఇప్పటి వరకు గృహాలను మంజూరు చేయకపోతే లబ్ధిదారులకు ఏం చెప్పాలని ప్రశ్నించారు. అర్బన్‌ ప్రాంతాల్లో గృహ యూనిట్‌ విలువ రూ.2 లక్షల్లో రూ.18 వేలు రుణం చెల్లించాలనే నిబంధనను సవరించాలని ఎమ్మెల్యేలు శ్రావణ్‌ కుమార్‌ - మోదుగుల వేణుగోపాలరెడ్డి - నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ నగరం పరిధిలో గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులు విధిగా నగరపాలక సంస్థ నుంచి ప్లాన్‌ అప్రూవల్‌ తీసుకోవాలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్లాన్‌ తీసుకోవాలని జీఎంసీ అధికారి తెలిపారు. అలా అయితే యూనిట్‌ విలువలో 14 శాతం - ఇతర అభివృద్ధి సెస్‌ 10 శాతం కింద నిధులు లబ్ధిదారులు చెల్లిస్తే వారికి మిగిలేది ఏమీ ఉండదని ముస్తపా పేర్కొన్నారు. ఈ అసంతృప్తుల‌ను స‌ద్దుమ‌ణిగించేందుకు కలెక్టరు కాంతిలాల్‌ దండే శ‌క్తికి మించి శ్ర‌మించాల్సి వ‌చ్చింద‌ని తెలుస్తోంది.