Begin typing your search above and press return to search.

'అదర్ కేస్ట్స్' వణికాయి

By:  Tupaki Desk   |   1 Feb 2016 8:21 AM GMT
అదర్ కేస్ట్స్ వణికాయి
X
కాపు గర్జన సందర్భంగా తునిలో జరిగిన అల్లర్లతో ఇతర కులాల వారిలో తీవ్ర ఆందోళన ఏర్పడింది. జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భంలో ఏం జరుగుతుందో తెలుసుకున్న వాహనదారులు అక్కడ జరుగుతున్న ఘటనలు, రైళ్లను తగలబెట్టడాలు వంటివి విని హడలిపోయారు. ఆ దారిలో ప్రయాణిస్తున్న కొన్ని ప్రధాన సామాజిక వర్గాల వారైతే భయంతో తమ కార్లపై ఉన్న స్టిక్కర్లను తొలగించారు. తమ కులాలను తెలిపేలా తమ పేర్లతో ఉన్న స్కిక్కర్లను అక్కడికక్కడే రోడ్లపైనే తీసేయడం కనిపించింది. కార్లపై కులాన్ని సూచించే పేర్లు కనిపిస్తే ఆందోళనకారులు దాడిచేస్తారన్న భయం వారిలో కనిపించింది.

అంతేకాదు... తుని, తూర్పుగోదావరిలోని ఇతర ప్రాంతాల్లోనూ చాలామంది ముందుజాగ్రత్తగా అప్రమత్తమైపోయారు. తమతమ సామాజికవర్గంలో అందుబాటులో ఉన్న పెద్దలతో సమావేశమై ఈ పరిణామాలు ఇంకా తీవ్రమైతే ఎలా ఎదుర్కోవాలన్న చర్చలు జరిపినసట్లు సమాచారం. గ్రామాల్లో కూడా ఈ ఉద్రిక్తతలు బలపడతాయేమోనన్న ఆందోళన చాలామందిలో కనిపించింది. రంగా హత్య అనంతర పరిణామాలను చాలామంది గుర్తు చేసుకుని భయంభయంగా గడిపారు. అయితే... అదృష్టవశాత్తు ఆందోళనలు అక్కడికే పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.