Begin typing your search above and press return to search.

జగన్ వైపే కాపు నేతలు

By:  Tupaki Desk   |   2 Aug 2018 4:07 AM GMT
జగన్ వైపే కాపు నేతలు
X
కాపులకు రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ లో ప్రతి రోజూ రచ్చ పెరుగుతూనే ఉంది. ఎన్నికల ముందు రిజర్వేషన్లకు సై అని ఆ తర్వాత ముఖం చాటేసిన చంద్రబాబు నాయుడిపై కాపు కులస్తులు మండిపడుతున్నారు. ఈ సమయంలోనే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు - ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడంతో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదని, తాను అధికారంలోకి వస్తే కాపు కార్పొరేషన్‌ కు ఇప్పుడున్న నిధుల కంటే మరిన్ని నిధులు ఇస్తానని జగన్ ప్రకటించారు. దీంతో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూడా దీనిపై జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా... తనకు ఎన్నికల్లో ఇది కీడు చేస్తుందని తెలిసినా జగన్ మాత్రం తన వైఖరిని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాపుల కంచుకోట కిర్లంపూడిలో ఉభయ గోదావరి జిల్లాల కాపు నాయకులు సమావేశం కావడం కీలకమైంది.

కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రిజర్వేషన్లపై తీవ్రంగా చర్చించినట్లు సమాచారం. కాపుల రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలు - అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చర్యలను ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఇందులో పాల్గొన్న కాపు నాయకుల్లో ఎక్కువ మంది జగన్ వ్యాఖ్యలను సమర్ధించారని చెబుతున్నారు. నిజానికి జగన్ చెప్పిన దాంట్లో వాస్తవమే ఉందని - ఇక్కడ తీర్మానాలు చేసినా దాన్ని రాజ్యాంగపరంగా అమలులోకి తీసుకురావాల్సింది మాత్రం కేంద్రమేనని వారిలో కొందరు అన్నట్లు సమాచారం. అయితే జగన్ మాత్రం కాపు కార్పొరేషన్‌ కు రెట్టింపు నిధులు ఇస్తామని ప్రకటించడం మంచి పరిణామమని - ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు చెప్పినవి ఏవీ అమలు కాలేదని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకుడొకరు వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. " శాసనసభలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు చేతులు కడుక్కుంటారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకోరు. జగన్ అయితే ఆ పని చేసినా... అది ఎంత వరకూ వచ్చిందో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తారు. పైగా కేంద్రంలో ఈసారి మళ్లీ బిజెపి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే చంద్రబాబు పని అయిపోయినట్లే. అందుకని మనం జగన్‌ కే మద్దతివ్వాలి " అని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలకు సమావేశంలో పాల్గొన్న ఇతర కాపు నేతలు కూడా మద్దతు పలికినట్లు చెబుతున్నారు. ముద్రగడ పద్మనాభం మాత్రం తాను జగన్‌ కు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు మళ్లీ ఇలా మాట్లాడితే సమస్య వస్తుందని అన్నట్లు తెలిసింది.

రాజకీయాల్లో ప్రకటనలు... ఖండించడాలు... వ్యతిరేకించడాలు ఉండవని... మీ వ్యాఖ్యలు కూడా అలాంటివే అని ఇతర కాపు నేతలు ముద్రగతతో అన్నట్లు సమాచారం. ఇక ముందు ఎవ్వరూ బహిరంగంగా మాట్లాడరాదని, అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాలని, చిరంజీవి కారణంగా సమాజంలో కాపులకు విలువ పోయిందని అన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ విషయంలోనూ అదే జరిగితే ఇతర కులాలే కాదు... కాపులు కూడా మనల్ని నమ్మరని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించినట్లు సమాచారం.