Begin typing your search above and press return to search.

కాపుల మీటింగులో కొందరు మిస్... ఏం జరుగుతోంది...?

By:  Tupaki Desk   |   1 March 2022 3:30 PM GMT
కాపుల మీటింగులో కొందరు మిస్... ఏం జరుగుతోంది...?
X
ఏపీలో కాపుల ఐక్యత మీద ఇపుడు పెద్ద ఎక్సర్ సైజ్ సాగుతోంది. నిజానికి కాపులకు అధికారం అన్నది ఏనాడో దక్కాలి. జనాభా పరంగా అది పెద్ద కమ్యూనిటీ. రాజ్యాధికారం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటింగ్ బట్టి మాత్రమే దక్కుతుంది. మరి అలా కనుక చూస్తే ఉమ్మడి ఏపీలోనే వారు పవర్ లోకి రావాలి. కానీ ఎందుకో అది అందని పండు అవుతోంది. దానికి కాపులలో అనైక్యత ప్రధాన కారణం అనే సొంత కులస్థులే అంటారు.

ఒక విధంగా కాపులను రాజకీయంగా వాడుకుని అతి తక్కువ జనాభా నుంచి వచ్చి రాజకీయ పార్టీలను లీడ్ చేస్తున్న నాయకులే బాగుపడ్డారు. ఈ రోజుకూ కధ అలాగే సాగుతోంది. ఈ నేపధ్యంలో గతంలో జరిగిన తప్పులను ఈసారి చేయకూడదు అని కాపు ప్రముఖులు, మేధావులు, రాజకీయ నాయకులు భావిస్తున్నారు. దాంతో వరసబెట్టి మీటింగులు పెడుతూ ఒక బలమైన వేదిక నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే హైదరాబాద్ లో జరిగిన సమావేశాలకు హాజరైన వారిలో కొందరు తాజాగా విశాఖ మీటింగులో కనిపించకపోవడం మీద కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వారిని పిలవలేదా, లేక పిలిచినా వారు రాలేదా అన్నదే ఇక్కడ చర్చగా ఉంది. కాపులకు ఈ రోజుకూ ఐకాన్ అంటే వంగవీటి రంగానే చెబుతారు. ఆయన వారసుడిగా కుమారుడు రాధా క్రిష్ణ ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో జరిగిన కాపు నేతల మీటింగునకు వచ్చారు.

కానీ విశాఖ మీటింగులో ఆయన కనిపించలేదు. దాంతో ఆయన ఎందుకు రాలేదు అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది. అదే సమయంలో కాపుల మీటింగులో చురుకుగా కదిలిన ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఆయన సీబీఐలో కూడా పనిచేశారు. గత మీటింగుల్లో కనిపించిన ఆయన తాజా భేటీలో ఎక్కడా లేకుండా పోయారు. మరి ఆయన ఎందుకు రాలేదు అన్నదే మరో చర్చగా ఉంది.

ఇక కాపుల మీటింగ్ పేరిట జరుగుతున్న భేటీల మీద కూడా రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ భేటీల వెనక ఎవరున్నారు అన్న దాని మీద ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో రకమైన డౌట్లు ముందుకు తెస్తోంది అంటున్నారు. కాపుల మీటింగ్ పేరుతో టీడీపీకి హెల్ప్ చేయడానికే అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఆ మీటింగులలో ఎక్కడా వైసీపీకి చెందిన కాపు నేతలు లేరు. దాంతో అది నిజమా అన్న చర్చా కూడా ఉంది.

ఇక బీజేపీ జనసేన కూటమికి కాపులను చేరువ చేయడానికే ఈ భేటీలూ కసరత్తులూ అని కూడా మరో రకమైన ఆరోపణలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కాపుల అజెండాను బీజేపీ భుజాన ఎత్తుకున్న వేళ ఈ భేటీలు కూడా సమాంతరంగా సాగడంతో అలా కూడా కొందరు ఆలోచనలు మళ్ళుతున్నాయట.

ఇక మరి కొందరు అయితే అధికార వైసీపీ నేతలే ఈ రకంగా కాపుల్లో చీలిక తెచ్చి రాజకీయంగా లాభం పొందడానికి ఈ రకమైన ప్రయోగాలు చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ అనుకూల వ్యక్తులు, శక్తుల నుంచి ఈ రకమైన వాదన తెర ముందుకు వస్తోంది. అయితే ఫారం ఫొర్ బెటర్ ఆంధ్రా అంటే రాజకీయాల కంటే ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని ఫారం ప్రతినిధులు అంటున్నారు. తాము రాజకీయాల ద్వారానే దీన్ని సాధిస్తామని చెబుతున్నారు.

కొన్ని కులాలకో పార్టీల మధ్యనో పరిమితం అయిన అధికారాన్ని, అభివృద్ధికి అందరికీ పంచడమే ఫారం లక్ష్యమ‌ని కూడా చెబుతున్నారు. అణగారిన వర్గాలకు అందలాలు దక్కాలీ అన్నదే ఫారం అజెండా అని కూడా వివరిస్తున్నారు. మొత్తానికి ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉందని కూడా అంటున్నారు.

మరి బలమైన టీడీపీ, వైసీపీ చేరో వైపున ఉన్నాయి. జనసేన కూడా బాగానే పుంజుకుంటోంది. అయినా ఏపీలో పొలిటికల్ స్పేస్ ఉందంటే కొన్ని కులాల ఆకాంక్షలను ఎవరూ పట్టించుకోవడంలేదు అన్నదే ఫారం ఫర్ బెటర్ ఏపీ ప్రతినిధుల వాదన‌గా ఉంది. మరి ముందు ముందు ఈ భేటీలు ఏ రకమైన చర్చకు దారి తీస్తాయో చూడాలి.