Begin typing your search above and press return to search.

కాపు కోటల్లో చిత్తైన జనసేన!

By:  Tupaki Desk   |   24 May 2019 2:30 PM GMT
కాపు కోటల్లో చిత్తైన జనసేన!
X
జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి దానిలోకి కాపు నేతలే ఎంట్రీనే ప్రముఖంగా కనిపించింది. అప్పటి వరకూ రాజకీయంగా అచేతనంగా ఉండిన పలువురు కాపు నేతలు జనసేనలో చాలా యాక్టివ్ గా కనిపించారు! అలాంటి వారి చేరిక జనసేనకు ఎంత బలాన్ని చేకూర్చిందో కానీ అది 'కాపుల' పార్టీ అనే ముద్రను వేసేందుకు మాత్రం చాలా కారణమైంది.

కమ్మ వాళ్లకు తెలుగుదేశం ఉంది, రెడ్లకు కాంగ్రెస్ ఉంది, జనాభ పరంగా గట్టిగా ఉన్న కాపులకు ఒక పార్టీ అనేది సహజ న్యాయంగానే అనిపించింది. అలా గట్టిగా కాపు ముద్రను వేయించుకున్న జనసేనకు తీరా ఎన్నికల సమయంలో మాత్రం గట్టి షాక్ ఇచ్చింది కాపులే అని స్పష్టం అవుతోంది.

కాపుల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన చిత్తుగా ఓడింది. తనకు కులం లేదని చెప్పుకున్న పవన్ కల్యాణ్ పోటీ మాత్రం కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోటే చేశారు. భీమవరం - గాజువాక వంటి కాపుల జనసంఖ్య గట్టిగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో పవన్ కల్యాణ్ పోటీ చేశారు.

ఆ రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన చిత్తు అయ్యారు. అంతే కాదు.. కాపుల జనాభా గట్టిగా ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా జనసేన చిత్తు చిత్తుగా ఓడటం గమనార్హం.

ఆ నియోజకవర్గంలో కాపుల జనాభా గట్టిగా ఉండటంతో మూడు పార్టీలూ అదే సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులను పోటీకి దించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లనాని ని పోటీకి దించగా, తెలుగుదేశం పార్టీ బడేటి బుజ్జిని బరిలోకి దించింది. జనసేన పార్టీ రెడ్డి అప్పల్నాయుడను పోటీ చేయించింది.

ఈ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాని డెబ్బై ఒక్క వేల ఓట్లకు పైగా పొందారు. తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి అరవై ఏడు వేల ఓట్లకు పరిమితం అయ్యారు. పోటీ అలా ఆ రెండు పార్టీల మధ్యనే సాగింది. జనసేన అభ్యర్థి కేవలం పదహారు వేల ఓట్లకు పరిమితం అయ్యారు!

ఇదీ కాపుల జనాభా గట్టిగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లో పరిస్థితి. జనసేన పార్టీ కాపు కోటల్లోనే చిత్తు కావడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంది!