Begin typing your search above and press return to search.

పాతికేళ్ల తర్వాత వణికిపోయిన ‘తుని’

By:  Tupaki Desk   |   1 Feb 2016 4:56 AM GMT
పాతికేళ్ల తర్వాత వణికిపోయిన ‘తుని’
X
ప్రశాంతతకు మారుపేరుగా నిలిచే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికి షాకింగ్ గా మారాయి. కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ తో చేపట్టిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారటమే కాదు.. తీవ్ర ఉద్రికత్తలకు కారణమైంది. అప్పుడెప్పుడో 25 కిందట తుని పట్టణంలో కర్ఫ్యూ విధించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఏ సందర్భంలోనూ ఇంతటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నది లేదు. ఊహించని రీతిలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో తుని ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటతో పెద్ద ఎత్తున ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. లక్షలాదిగా ఉన్న జనంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. రైల్వేస్టేషన్లో రైలు.. పోలీస్ స్టేషన్లను తగులబెట్టారని తెలుసుకున్న వ్యాపారస్తులు.. రోడ్ల మీద ఉన్న సాధారణ జనం భయంతో పరుగులు పెట్టారు.

షాపులు మూసేసి ఇళ్లకు వెళ్లిపోయారు. కరెంటు కాసేపు లేకపోవటం.. ఏం జరుగుతుందో అర్థం కాకపోవటంతో తుని పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాత్రి 10 గంటలకు పరిస్థితిలోకాస్త మార్పు వచ్చిందని భావించినా.. అర్థరాత్రి 12 గంటల సమయంలో కొందరు యువకులు పెట్రోల్ బాటిళ్లు పట్టుకొని తిరగటం పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పలు మాటలు.. వ్యాఖ్యలు తుని పట్టణంలో ఏం జరుగుతుందోనన్నభయానికి గురి చేసేలా చేశాయి.

‘‘తుని’’ ఇప్పుడెలా ఉంది?

ఆదివారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న తుని పట్టణంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. తుని పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నా.. ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రావటం లేదు. ప్రత్యేకంగా వచ్చిన భద్రతా బలగాలు తుని పట్టణంలో పహరా కాస్తున్నారు. తగలబడిపోయిన రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను చూసేందుకు స్థానికులు రైల్వే స్టేషన్ కు వెళుతున్నారు. విజయవాడ.. విశాఖపట్నం మార్గంలో రైళ్లు యధావిధిగా నడుస్తున్నాయి.