Begin typing your search above and press return to search.

బాబును టైం చెప్ప‌మ‌ని షాకిచ్చిన కాపు నేత‌లు

By:  Tupaki Desk   |   15 Aug 2017 4:39 AM GMT
బాబును టైం చెప్ప‌మ‌ని షాకిచ్చిన కాపు నేత‌లు
X
తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు విచిత్ర‌మైన అనుభ‌వం ఎదురైంది. కాపు రిజ‌ర్వేష‌న్ల అంశంపై ఓప‌క్క రాజ‌కీయ‌నాయ‌కుడు క‌మ్ కాపు ఉద్య‌మ‌నేత‌ ముద్ర‌గ‌డతో ఏపీ సీఎం చంద్ర‌బాబు ఎంత ఇబ్బంది ప‌డుతున్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రమే లేదు. ఆయ‌న చేస్తాన‌న్న పాద‌యాత్ర‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌న్న విమ‌ర్శ ఏపీ ప్ర‌భుత్వం మీద ఉంది.

త‌న మూడున్న‌రేళ్ల పాల‌న‌లో కాపుల‌కు బాబు భారీ అన్యాయ‌మే చేశామ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్న వేళ‌.. కాపు నేత‌ల్ని కొంద‌రితో ముఖ్య‌మంత్రి.. మంత్రుల నేతృత్వంలో తాజాగా ఒక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఇలాంటి స‌మావేశంలో ఉద్య‌మానికి నేతృత్వం వ‌హిస్తున్న‌వారితో పాటు వివిధ భావ‌జాలం వినిపించే స‌ద‌రు సామాజిక వ‌ర్గానికి చెందిన ఇత‌ర నేత‌ల్ని పిలిపించాల్సి ఉంది.

అయితే.. అందుకు భిన్నంగా కొంద‌రితోనూ స‌మావేశాన్ని నిర్వ‌హించిన చంద్రబాబుకు ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఎదురైంద‌ని చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఎవ‌రూ కోర‌కుండానే కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు చంద్ర‌బాబు. కాపుల్ని బీసీల్లో చేర్చాల‌న్న సుదీర్ఘ డిమాండ్‌ ను తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప‌రిష్క‌రిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికారు.

చూస్తుండ‌గానే మూడున్న‌రేళ్ల పుణ్య‌కాలం గ‌డిచిపోయి.. కాపు రిజ‌ర్వేష‌న్ల మీద ముద్ర‌గ‌డ లాంటోళ్లు తీవ్రంగా శ్రమిస్తుండ‌టంతో ఏపీ ముఖ్య‌మంత్రి ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో త‌మ ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించే కాపు నేత‌ల‌తో తాజాగా చంద్ర‌బాబు స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా కాపు నేత‌లు మాట్లాడిన మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కాపుల సంక్షేమం కోసం బాబు ప్ర‌భుత్వం చాలానే చేస్తుంద‌న్న‌ మాట వినిపిస్తార‌ని భావించిన కాపు నేత‌లు అందుకు భిన్నంగా కాపుల‌కు న్యాయంగా ఇవ్వాల్సిన రిజ‌ర్వేష‌న్ల గురించి ప్ర‌స్తావించి.. త‌మ‌కు న్యాయం చేయాల‌ని త‌మ వాద‌న‌ను బ‌లంగా వినిపించ‌టం ఏపీ అధికార‌ప‌క్షానికి ఇబ్బంది క‌లిగించే అంశంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

చంద్ర‌బాబు సమ‌క్షంలో కాపు నేత‌లు చెప్పిన మాట‌ల్ని చూస్తే.. ‘‘కాపులకు రాజకీయ రిజర్వేషన్లు అవసరం లేదు. వీలైనంత త్వరగా బీసీల్లో చేర్చండి. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించండి. ఏ ఇతర బీసీ కులాల ప్రయోజనాలకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు. కాపులను బీసీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లకు కోత పడుతుందన్న భయం కొన్ని బీసీ వర్గాల్లో ఉంది. వారి ఆందోళన తొలగించేందుకే మాకు రాజకీయ రిజర్వేషన్లు వద్దంటున్నాం. పేదరికంలో మగ్గుతున్న కాపు కులస్తులకు ఆర్థికంగా చేయూత కావాలి. కాపులకు రిజర్వేషన్ల కల్పనకు నిర్దిష్ట గడువు ప్రకటించండి..’’ అని చంద్ర‌బాబును టైం అడిగేశారు. దీనికి బ‌దులుగా ప్ర‌సంగించిన చంద్ర‌బాబు తాను ఉన్నంత వ‌ర‌కూ కాపుల‌కు అన్యాయం జ‌ర‌గ‌ద‌ని.. కాపుల మ‌నోభావాల్ని తాను అర్థం చేసుకున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

రాజ‌కీయ రిజ‌ర్వేష‌న్లు వ‌ద్దంటూ తీసుకున్న నిర్ణ‌యం మంచిద‌ని.. త్వ‌ర‌లోనే మంజునాథ క‌మిష‌న్ నివేదిక వ‌స్తుంద‌ని.. అన్ని వ‌ర్గాల మ‌ధ్య స‌మ‌తుల్య‌త‌ను పాటించి త‌గు నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. మూడున్న‌రేళ్లుగా ఇదే మాట చెబుతున్న చంద్ర‌బాబు.. కాపు నేత‌లు కోరిన‌ట్లుగా ఫ‌లానా టైంలో తాను ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటాన‌న్న మాట మాత్రం చెప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం.