Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ పాద‌యాత్ర..కోడి పందాల‌తో లింక్‌

By:  Tupaki Desk   |   21 Jan 2017 6:54 AM GMT
ముద్ర‌గ‌డ పాద‌యాత్ర..కోడి పందాల‌తో లింక్‌
X
కాపులను బీసీల్లో చేర్చాలంటూ తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం 'కాపు సత్యాగ్రహ' పాదయాత్రకు స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈనెల 25న చేపట్ట‌నున్న ఈ పాద‌యాత్ర‌కు ఏర్పాట్లు చేస్తున్న కాపు నాయ‌కులు ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డుతున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పాదయాత్రను అడ్డుకుంటామని హోం మంత్రి - ఉప‌ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌ ప్రకటించడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోడిపందేలకు లేని ఆంక్షలు సత్యాగ్రహ యాత్రకు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

కోడి పందాలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ య‌థేచ్చ‌గా నిర్వ‌హించితే నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు ఉండిపోయిన ఏపీ ప్ర‌భుత్వం ప్రజాస్వామ్య రూపంలో పాద‌యాత్ర చేస్తే ఎందుకు అడ్డుకుంటోంద‌ని నిల‌దీస్తున్నారు. ప్ర‌భుత్వానికి వ్య‌వ‌తిరేకంగా గ‌ళం విప్పే వారిని అణిచివేయడం ఏ విధంగా స‌బ‌బు అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం యాత్రం 25న ఉదయం 10 గంటలకు రావులపాలెం నుంచి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభమవుతుందని, ఈ యాత్ర ఐదురోజులపాటు కొనసాగుతుందని కాపు నేత‌లు స్పష్టం చేస్తున్నారు. ఇదిలాఉండ‌గా కాపు సత్యాగ్రహ యాత్రపై ముద్రగడ మరోసారి ఆలోచించాలని ఏపీ కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు కోరారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనుమానాలుంటే నివృత్తి చేస్తామని ముద్రగడ పద్మనాభంకు తెలిపారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా పలు పథకాలు అమలు చేస్తున్నామని, కాపు విద్యార్థులకు బీసీలతో సమానంగా స్కాలర్‌ షిప్‌ లు అందించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. పాద‌యాత్ర పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటారని ఆయ‌న స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/