Begin typing your search above and press return to search.

వంగవీటి రాధాను ఓడిస్తాం: కాపునాడు

By:  Tupaki Desk   |   13 March 2019 10:27 AM IST
వంగవీటి రాధాను ఓడిస్తాం: కాపునాడు
X
బెజవాడ రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంటోంది. వంగవీటి రాధా తాజాగా టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాపునాడు సంచలన నిర్ణయం తీసుకుంది. వంగవీటి టీడీపీలో చేరి ఎక్కడ పోటీచేసినా తాము అతడికి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామని స్పష్టం చేసింది.

కాపునాడు అధ్యక్షుడు శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 2014లో టీడీపీకి మద్దతు పలికారు. అప్పుడు మెజార్టీ కాపు సామాజికవర్గం ఓటర్లు టీడీపీ-బీజేపీ కూటమికి ఓటేశాయి.కానీ ఈ ఎన్నికల్లో అలా జరగడం లేదు.’ అని స్పష్టం చేశారు. ఇక వంగవీటి రాధా చేసిన ప్రకటనపై కూడా శ్రీను మండిపడ్డారు. వంగవీటి రంగా హత్యలో టీడీపీ ప్రమేయం లేదన్న రాధా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే రాధా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ’ శ్రీను హెచ్చరించారు.

అయితే కాపునాడు వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తుందనే విషయాన్ని మాత్రం ఇప్పటివరకూ బహిరంగంగా వెల్లడించలేదు. కానీ అందరి అంచనాల ప్రకారం.. కాపునాడు మద్దతు జనసేనకే ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిణామాలను బట్టి వంగవీటి రాధా ఈ రెండు మూడు రోజుల్లోనే టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబుతో చర్చలు జరిపిన రాధా ఎక్కడినుంచి పోటీచేయాలనే దానిపై ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. అయితే కాపు సామాజికవర్గం నుంచి ఇన్నాళ్లు విశేషమైన మద్దతు పొందిన వంగవీటి రాధాకు ఈసారి మాత్రం వారి నుంచి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది.