Begin typing your search above and press return to search.

టార్గెట్ క‌ర‌ణం.. ఎందుకు? వైసీపీకి దూర‌మేనా?

By:  Tupaki Desk   |   28 Sep 2021 2:54 AM GMT
టార్గెట్ క‌ర‌ణం.. ఎందుకు?  వైసీపీకి దూర‌మేనా?
X
గ‌త కొన్ని రోజులుగా సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనుభ‌వం ఉన్న నేత‌.. చీరాల ప్ర‌స్తుత ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తిపై తీవ్ర‌స్తాయిలో వ్య‌తిరేక వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌ను విల‌న్‌గా చూపించే ప్ర‌య‌త్నాలూ జ‌రుగుతున్నాయి. ఇలా ఎందుకు జ‌రుగుతోంది? నిజంగా ఆయ‌న విల‌నే అయితే.. చీరాల ప్ర‌జ‌లు.. భారీ జ‌గ‌న్‌సునామీలోనూ ఆయ‌న‌ను ఎందుకు గెలిపించారు? ఆయ‌న‌కే ఎందుకు ప‌ట్టంక‌ట్టారు? అనేది ప్ర‌శ్న‌. దీనికితోడు.. ఆయ‌నేమ‌న్నా.. అవినీతి ప‌రుడా? అక్ర‌మాలు చేశారా? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశం. చీరాల రాజకీయాలు క‌ర‌ణంకు ఇప్పుడు కొత్త‌కాదు. గ‌తంలోనూ ఆయ‌న ఒకసారి ఇక్క‌డ చ‌క్రం తిప్పారు.. అయితే.. ఇప్పుడే ఎందుకు వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది?

దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయ‌న ముక్కు సూటి రాజ‌కీయ‌మే. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే నాయ‌కుల్లో క‌ర‌ణం ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇది నేటి రాజ‌కీయ నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. గ‌తంలోనూ టీడీపీలో ఇదే కార‌ణంతో కొన్నినెల‌ల పాటు దూరంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు చీరాల నుంచి గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న టీడీపీని వీడి.. వైసీపీలోచేరారు. దీనికి వ్య‌క్తిగ‌త కార‌ణాలు ఉన్నాయి. త‌న‌పై న‌మోదైన కొన్ని కేసుల నుంచి ర‌క్ష‌ణ కావొచ్చు... లేదా,.. రాజ‌కీయంగా త‌న‌కుమారుడు వెంక‌టేష్‌కు భ‌విష్య‌త్తును తీర్చ‌దిద్దుకునేందుకు కావొచ్చు. ఏదైనా స‌రే.. ఇత‌ర రాజ‌కీయ నేత‌ల్లానే ఆయ‌న ఇప్పుడు పార్టీ మారారు. ఆదిలో కాంగ్రెస్‌లో ఉన్న క‌ర‌ణం.. త‌ర్వాత టీడీపీ ఆవిర్భావంతో ఈ పార్టీలోకి వ‌చ్చారు. అప్ప‌టి నుంచి మొన్న‌టి ఎన్నిక ల‌వ‌ర‌కు కూడా టీడీపీలోనే ఉన్నారు.

స‌హ‌జంగానే సీనియార్టీ ప్ర‌భావం ఆయ‌న‌పై ఉంది. ఈ క్ర‌మంలో త‌న మాటే నెగ్గాల‌నే ముక్కుసూటి వాద‌న ఆయ‌న‌ను అంద‌రికీ దూరం చేసింది. ఇక‌, చీరాల విష‌యానికి వ‌స్తే.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌తో బ‌ద్ధ శ‌త్రుత్వం క‌ర‌ణంకు ఏమాత్రం లేదు. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు ఒక్క‌టే వీరి మ‌ధ్య రాజ‌కీయాలు పెంచింది. ఇక‌, తాను ఎమ్మెల్యే క‌నుక‌.. త‌న మాట నెగ్గాల‌నే పంతం.. స‌హ‌జంగానే వ్య‌క్తం చేయ‌డం.. ఎవ‌రైనా చేస్తున్న ప‌నే. వైసీపీలోనూ అదే క‌నిపిస్తోంది. అయితే.. దీనికి మించి క‌ర‌ణం ఏమైనా చేశారా? అంటే.. ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా ఇక్క‌డి ప్ర‌జ‌లు క‌ర‌ణంను న‌మ్మారు. ఆయ‌న‌ను గెలిపించారు. అంతేకాదు.. స్థానిక ఎన్నిక‌ల్లోనూ చీరాల మునిసిపాలిటీని క‌ర‌ణం వ‌ర్గానికే క‌ట్ట‌బెట్టారు. అయితే.. జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గానికి వ్య‌తిరేకులు కాబ‌ట్టి.. తాము కూడా అదే రేంజ్లో ఉండాల‌నే ఒక్క ఆలోచ‌న‌తోనే క‌ర‌ణంపై స్థానిక ఆమంచి వ‌ర్గం కాలు దువ్వుతోంది.

పోనీ.. ఈ క్ర‌మంలో వారేమైనా పైచేయిసాధించారా? అంటే.. అది కూడా లేదు. కింద‌ప‌డ్డా పైచేయి నాదే అన్న‌ట్టు గా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఆమంచి విష‌యంలో జోరుగా వినిపిస్తోంది. ఇది క‌ర‌ణం వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. ఎవ‌రు మాత్రం దీనిని ఒప్పుకొంటారు. ఆఖ‌రుకు ఈ పంచాయ‌తీ.. వైసీపీ అధిష్టానం వ‌ద్ద‌కు చేర‌డంతో.. క‌ర‌ణంకు అనుకూలంగానే అధిష్టానం ప్ర‌వ‌ర్తించింది. ఆయ‌న ఇక్క‌డే ఉంటారు.. మీరు(ఆమంచి) ప‌రుచూరుకు వెళ్లండి అని సున్నితంగా చెప్పింది. అయినా.. కూడా ఆమంచి వ‌ర్గం.. పెద్ద ఎత్తున క‌ర‌ణంపై విమ‌ర్శ‌నాత్మ‌క వార్త‌లు రాయిస్తోంద‌ని.. క‌ర‌ణం వ‌ర్గం పేర్కొంటోంది.

ప్ర‌స్తుతం చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఇది సింప‌తీకి దారితీస్తోంది. క‌ర‌ణం చేసిన తప్పేంట‌నేది ఇక్క‌డి వారు కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాదు..క‌ర‌ణం వ‌చ్చిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌పై ఎలాంటి వ‌త్తిళ్లు లేవ‌నేది.. ప్ర‌ధానంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రి.. దీనిని బ‌ట్టి.. క‌ర‌ణంపై వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టా.. ? లేన‌ట్టా? అనేది ఆమంచి వ‌ర్గ‌మే తేల్చుకోవాల‌ని అంటున్నారు క‌ర‌ణం వ‌ర్గీయులు. అంతేకాదు.. అవినీతి ర‌హిత‌మైన త‌మ‌నేత‌కు పొగ పెట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.