Begin typing your search above and press return to search.

కరణం కూడా జంపేనా?...సుజనాతో భేటీ అందుకేనా?

By:  Tupaki Desk   |   25 Oct 2019 1:32 PM GMT
కరణం కూడా జంపేనా?...సుజనాతో భేటీ అందుకేనా?
X
ఏపీలో ఇప్పుడు రాజకీయం అంతా హాట్ హాట్ గా నడుస్తోంది. ఐదు నెలల క్రితమే ఎన్నికలు ముగిసినా, అధికారం దక్కించుకున్న వైసీపీ ఇతర పార్టీల నేతలపై ఏమాత్రం దృష్టి సారించకున్నా కూడా ఏపీ రాజకీయం హాట్ హాట్ గానే సాగుతోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి... తనతో పాటు మరో ముగ్గురు ఎంపీలను కూడా పట్టుకెళ్లిపోయారు. అయితే ఆ ముగ్గురితోనే సుజనా సరిపెట్టుకున్నట్లుగా కనిపించడం లేదన్న వాదనలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే - టీడీపీ యువనేత వల్లభనేని వంశీమోహన్ ను బీజేపీలోకి లాగేందుకు సుజనా యత్నిస్తున్నారన్న వార్తలు ఓ వైపు వైరల్ గా మారగా... తాజాగా వంశీతో పాటుగా టీడీపీలో తొలి తరం నేత - ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పైనా సుజనా దృష్టి సారించారన్న వార్తలు మరింత కలకలంగా మారాయి.

శుక్రవారం ఉదయం వంశీమోహన్ తో భేటీ అయిన సుజనా... మధ్యాహ్నం సమయానికి కరణం ఇంటిలో ప్రత్యక్షమైపోయారు. సుజనాతో పాటు కరణం కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు అవడంతో పాటుగా మొన్నటిదాకా ఇద్దరు నేతలు కూడా టీడీపీలోనే కొనసాగారు కదా. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయని కూడా చెప్పక తప్పదు. మధ్యాహ్నం కరణం ఇంటికి వెళ్లిన సుజనా... అక్కడే భోజనం చేసినట్లుగా సమాచాం. అంతేకాకుండా భోజనం తర్వాత ఇద్దరు నేతలు చాలా సేపే మాట్లాడుకున్నారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. టీడీపీకి భవిష్యత్తు లేదని, రాజకీయంగా మరింత కాలం పాటు కొనసాగాలనుకునే వారు... టీడీపీని వీడటం మినహా మరో మార్గం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీకి చెందిన కీలక నేతలందరినీ సుజనా తన పాత పరిచయాలను వినియోగించుకుని కలుస్తూ సాగుతున్నారు. ఈ భేటీల్లో ఆయా నేతల రాజకీయ భవిష్యత్తుతో పాటు టీడీపీ ఫ్యూచర్ పైనా చర్చలు జరుపుతున్నారట.

ఇందులో భాగంగానే సుజనా చౌదరి తాజాగా కరణంతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీలో గట్టి నేతగానే కొనసాగుతున్న కరణం... చంద్రబాబుతో చాలా పర్యాయాలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. తన కుమారుడికి సీటు కోసం చంద్రబాబుతో కరణం నిజంగానే బహిరంగ యుద్ధానికి దిగినంత పని చేశారు. పార్టీలో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న కరణం... తాను అనుకున్న దానిని సాధించుకునేందకు అధిష్ఠానాన్ని ఢీకొట్టేందుకు కూడా వెనుకాడరన్నవాదన ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈ క్రమంలో టీడీపీకి హ్యాండిచ్చేసిన సుజనా తన ఇంటికి వస్తే... సాదరంగా ఆహ్వానించడంతో పాటుగా కలిసి భోజనం చేయడం, రాజకీయాలపై చర్చలు జరపడం చూస్తుంటే... కరణం కూడా టీడీపీని వీడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే... ఇప్పటికే ఘోర పరాజయంతో నానా అవస్థలు పడుతున్న టీడీపీకి మరో బిగ్ షాక్ తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.