Begin typing your search above and press return to search.

బలరామకృష్ణుల యుద్ధం

By:  Tupaki Desk   |   14 Feb 2019 4:34 AM GMT
బలరామకృష్ణుల యుద్ధం
X
ఆంధ్రా రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు రాజకీయ రణరంగంలో దిగేందుకు సమాయత్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని పార్టీ అధినేతలు రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. అధికార టీడీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు ఎత్తులపై ఎత్తులు వేస్తుండగా, ప్రతిపక్ష వైసీపీ, జనసేనలు కూడా అంతేస్థాయిలో ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో రాజకీయం పదేళ్లుగా వన్‌ సైడ్‌ వార్‌ అన్నట్లుగా నడుస్తోంది. పార్టీలతో సంబంధం లేకుండా ఒకే వ్యక్తి నియోజకవర్గాన్ని ఏలుతున్నాడు. ఆయనే ఆమంచి కృష్ణమోహన్‌. ఈ పేరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా పాపులర్‌ గా మారింది. నియోజవర్గంలో మంచి పట్టు సాధించిన ఆయన ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. అంతేకాకుండా పార్టీ అధినేత చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.

తాజాగా ఆమంచి వైసీపీ అధినేత జగన్‌ ను కలవడంతో టీడీపీలో కలవరం మొదలైంది. నెలరోజుల కిందట పార్టీ మారుతున్నారన్న వ్యాఖ్యలపై ఆయన చంద్రబాబుకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడంతో టీడీపీకీ దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. 'చంద్రబాబు చెప్పిన ప్రతి మాట వినడానికి మాకు ఇష్టం లేదు. ఐదేళ్లుగా ఆయన సాధించిందేమీ లేదని వ్యాఖ్యలు చేయడంతో ఆయన వైసీపీలోకి చేరుతున్నట్లు అర్థమవుతోంది.

ఇదిలా ఉండగా ఆమంచి కృష్ణమోహన్‌ వైసీపీలో చేరుతుండడంతో నియోజకవర్గంలో కొందరు టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు పేలుస్తూ గోలగోల చేశారు. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంకు చీరాల స్థానాన్ని కేటాయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆయనకు మద్దతుగా ఫ్లెక్సీలు కూడా వెలిశాయి.

కరణం బలరాం జిల్లాలోనే పట్టున్న నాయకుడిగా పేరుంది. 1985, 89లో మార్టురు నుంచి గెలుపొందారు. 1999లో ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్‌ కు వెళ్లారు. 2004లో అద్దంకి నుంచి విజయం సాధించారు. అయితే 2009లో ఆయన, 2014లో ఆయన కుమారుడు కరణం వెంకటేశ్‌ ఓటమి చెందారు. అయినా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్సీ పదవిని చేజిక్కించుకున్నారు.

ప్రస్తుతం చీరాల నియోజకవర్గం బలరాంకు అవకాశాన్నిచ్చినట్లయింది. అయితే ఆమంచి కృష్ణమోహన్‌ను ఢీకొట్టడం ఆషామాషీ కాదు. అందులోనూ బలరాం సైతం మంచి పట్టున్న నాయకుడని పేరుంది. దీంతో వీరిద్దరి మధ్య పోరు రసవత్తరంగా మారనుంది.