Begin typing your search above and press return to search.

సెల‌బ్రిటీల కోసం ప‌రుగెందుకు బాబు?

By:  Tupaki Desk   |   4 Nov 2018 6:49 AM GMT
సెల‌బ్రిటీల కోసం ప‌రుగెందుకు బాబు?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న సోష‌ల్ మీడియా స‌మ్మిట్ అండ్‌ అవార్డుల కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. నిర్మాణం కూడా పూర్తి కాని రాష్ట్ర రాజ‌ధానికి పర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే పేరుతో సీఎం చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేప‌డుతున్న ఇలాంటి కార్య‌క్ర‌మాల కార‌ణంగా కోట్ల రూపాయ‌ల‌ ప్ర‌జాధ‌నం వృథా అవుతోందంటూ స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

గ‌తేడాది అమ‌రావ‌తిలో సోష‌ల్ మీడియా స‌మ్మిట్ అండ్‌ అవార్డుల ఫంక్ష‌న్‌ ను బాబు ప్ర‌భుత్వం నిర్వ‌హించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకొనె నాటి కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు. ఈ నెల 10న విబ్రి మీడియా స‌హ‌కారంతో అమ‌రావ‌తిలో మ‌రోసారి ఈ ఫంక్ష‌న్‌ ను అట్ట‌హాసంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మవుతోంది. ఈ కార్యక్ర‌మానికి బాలీవుడ్ బ్యూటీ క‌రీనా క‌పూర్ హాజ‌రు కానున్నారు. క‌రీనా అమ‌రావ‌తికి రానుండ‌టం ఇదే తొలిసారి.

అయితే - స‌మ్మిట్ పేరుతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేస్తున్న ఖ‌ర్చు మాత్రం ప్ర‌జ‌ల‌కు రుచించ‌డం లేద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాలంటూ చాలామంది సెల‌బ్రిటీల‌ను ప్ర‌భుత్వం సంప్ర‌దిస్తున్నట్లు వారు చెబుతున్నారు. క‌రీనా - దీపిక వంటి ఏదైనా ఈవెంట్‌ కు విచ్చేస్తే భారీగా పారితోషికం పుచ్చుకుంటార‌ని గుర్తుచేస్తున్నారు. ఒక‌రిద్ద‌రు సెల‌బ్రిటీల‌పై ఇంత‌లా ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు పెట్ట‌డం ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అమ‌రావ‌తి న‌గ‌ర నిర్మాణం ఇంకా పూర్త‌వ్వ‌నే లేదు. కాబట్టి నిర్మాణ ప‌నుల‌పై దృష్టి పెట్ట‌కుండా ఇప్పుడే అతిథులు - ప‌ర్యాట‌కులంటూ ప్ర‌భుత్వం వారి వెంట‌ప‌డ‌టం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప‌లువురు నిల‌దీస్తున్నారు. పిల్ల పుట్ట‌క‌ముందే కుల్ల కుడుతున్న చందాన సీఎం వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డుతున్నారు. సెల‌బ్రిటీల రాక‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండ‌ద‌ని.. ఇలాంటి అన‌వ‌స‌ర ఆర్భాట‌పు కార్య‌క్ర‌మాల పేరుతో ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. తొలుత ఆక‌ర్ష‌ణీయ‌ - అద్భుత రాజ‌ధాని నిర్మాణంపైనే చంద్ర‌బాబు దృష్టిపెట్టాల‌ని వారు సూచిస్తున్నారు. సెల‌బ్రిటీల‌పై కాకుండా రాష్ట్రంలోని పేద ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర్చేందుకు నిధులు ఖ‌ర్చు చేయాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.