Begin typing your search above and press return to search.

పంతం....మైసూర్ పాక్...మీదా? మాదా? సై!

By:  Tupaki Desk   |   16 Nov 2017 5:28 PM GMT
పంతం....మైసూర్ పాక్...మీదా? మాదా? సై!
X
త‌మ ప్రాంతంలో ప్ర‌సిద్ధి చెందిన వ‌స్తువు గురించో, వంటకం గురించో అక్క‌డి ప్ర‌జ‌లు గొప్ప‌గా చెప్పుకుంటారు. వేరే ప్రాంతాల‌లో ఉన్న త‌మ బంధువుల‌కు, మిత్రుల‌కు వాటిని ప‌రిచ‌యం కూడా చేస్తుంటారు. ఆ ప్ర‌జ‌ల‌ ప్రాంతీయాభిమానం వ‌ల్ల వాటికి ఎన‌లేని గుర్తింపు వ‌స్తుంది. ఆ గుర్తింపు కేవలం కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం కాకుండా భౌగోళిక గుర్తింపుగా మారుతున్న‌పుడు ఆ ప్రాంత ప్ర‌జ‌ల ఆనందానికి ప‌ట్ట‌ప‌గ్గాలుండ‌వు. అటువంటి స‌మ‌యంలో ఆ గుర్తింపును వేరే ప్రాంతం వారు లాక్కొనే ప్ర‌య‌త్నం చేస్తే వారు అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతారు. కొద్దిరోజుల క్రితం ర‌స‌గుల్లా భౌగోళిక గుర్తింపు విషయంలో ప‌శ్చిమ బెంగాల్, ఒడిసాలు మ‌ల్ల‌గుల్లాలు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. చివ‌ర‌కు ఆ వంట‌కం బెంగాలీల‌దేన‌ని అధికారులు తేల్చ‌డంతో ఆ వివాదం స‌ద్దుమ‌ణిగింది. అదే త‌ర‌హాలో తాజాగా మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. ద‌క్షిణాది రాష్ట్రాల‌లో ప్ర‌త్యేక స్వీట్ గా ప్ర‌ఖ్యాతిగాంచిన మైసూర్ పాక్ మాదంటే మాద‌ని కర్నాటక, త‌మిళ‌నాడు రాష్ట్రాలు సోష‌ల్ మీడియాలో కొట్టుకు చ‌స్తున్నాయి.

ఈ స్వీట్‌ తమదంటే తమద‌ని సోషల్‌ మీడియాలో త‌మిళులు, కన్నడిగులు `వ‌ర్డ్` వార్ చేస్తున్నారు. అస‌లే ప్రాంతీయాభిమానం న‌ర‌న‌రాల్లో జీర్నించుకుపోయిన త‌మిళులు.... మైసూర్‌పాక్‌ మూలాలు తమ రాష్ర్టంలోనే ఉన్నాయని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. త‌మిళుల క‌న్నా రెండాకులు ఎక్కువే చ‌దివామ‌న్ని రీతిలో కన్నడిగులు అస‌లు `మైసూర్‌` పాక్ పేరు త‌మ రాష్ట్రం నుంచే ఉద్భ‌వించింద‌ని ఘంటాప‌థంగా చెబుతున్నారు. రాజా కృష్ణ రాజ వడయార్ పాక‌శాల‌లో మైసూర్ పాక్ పుట్టింద‌ని వాదిస్తున్నారు. మైసూర్ ప్యాలెస్‌ చెఫ్‌ కకసుర మాదప్ప నెయ్యి, చక్కెర, శనగపిండితో త‌యారుచేసి దానిని రాజా గారి మెనూలో వండివార్చేవాడని చెబుతున్నారు. అందుకే, కాలక్రమంలో ఆ వంట‌కం పేరు మైసూర్ పాక్‌గా ప్ర‌ఖ్యాతిగాంచింద‌ని క‌న్న‌డిగులు తేల్చేశారు.

క‌న్న‌డిగుల వెర్ష‌న్ కు భిన్నంగా తమిళులు మరో కథ వినిపిస్తున్నారు. మద్రాస్ కు చెందినవారు మైసూర్‌ పాక్ ను కనుగొన్నారని వారు వాదిస్తున్నారు. 74 ఏళ్ల కిందట ఓ న్యాయవాది ఈ వంటకం సీక్రెట్‌ ఫార్ములాను దొంగిలించి మైసూర్‌ రాజాకు అప్పగించారని చెబుతున్నారు. ఆ త‌ర్వాత మైసూర్‌ రాజా ఆ వంట‌కం క్రెడిట్ ను క‌ర్ణాట‌క ఖాతాలో వేసుకున్నార‌ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. అంతేకాదు, అందుకు బ్రిటిష్ వారిని కూడా సాక్షులుగా చేరుస్తున్నారు. ఆ మైసూర్ పాక్ మ‌ర్మాన్ని స్వయంగా లార్డ్ మెకాలే 1835లో బ్రిటన్‌ పార్లమెంట్‌కు వివరించారని చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం పై ఎవ‌రికి తోచిన‌ట్లుగా వారు సోషల్‌ మీడియాలో విచ్చ‌ల‌విడిగా పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారు. ర‌స‌గుల్లా త‌మ‌దేన‌ని ప‌శ్చిమ బెంగాల్ ఆధారాలు చూప‌డంతో ఆ రాష్ట్రానికే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్(జీఐ) ద‌క్కింది. అదే త‌ర‌హాలో మైసూర్ పాక్ కాపీరైట్స్ త‌మ‌వే న‌ని ప్రూవ్ చేసుకున్న రాష్ట్రానికే జీఐ(భౌగోళిక గుర్తింపు) ద‌క్కుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. అంచేత‌, సోష‌ల్ మీడియాలోకుమ్ములాట‌లు ఆపి ఆధారాలు సేక‌రించే ప‌నిలో ఉంటే మంచిద‌ని ప‌లువురు నెటిజ‌న్లు త‌మ స‌హ‌చ‌రుల‌కు హిత‌బోధ చేస్తున్నారు.