Begin typing your search above and press return to search.

క‌న్న‌డ నాట‌... బీజేపీ ఓట‌మి సంపూర్ణం!

By:  Tupaki Desk   |   25 May 2018 7:45 AM GMT
క‌న్న‌డ  నాట‌... బీజేపీ ఓట‌మి సంపూర్ణం!
X
క‌న్న‌డ నాట జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.... జాతీయ స్థాయిలో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌గా భావించిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని విష‌యం తెలిసిందే క‌దా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినా... ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన‌న‌న్ని సీట్లు సాధించ‌లేక క‌మ‌ల‌నాథులు బొక్క బోర్లా ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ మోదీ స‌ర్కారు నియ‌మించిన గ‌వ‌ర్న‌ర్ వాజూభాయ్ వాలా స‌హ‌కారంతో క‌న్న‌డ నాట బీజేపీ స‌ర్కారును ఏర్పాటు చేసిన ఆ పార్టీ క‌ర్ణాట‌క అధ్య‌క్షుడు, మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప‌... మూడంటే మూడు రోజుల‌కే ప‌ద‌వి నుంచి దిగిపోయారు. ఇక ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ... థ‌ర్డ్ ప్లేస్‌లో నిలిచిన జేడీఎస్‌కు మ‌ద్ద‌తిచ్చి... ఆ పార్టీ నేత కుమార‌స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అంగీక‌రించింది. వెర‌సి ఎన్నిక‌ల‌కు ముందు తానే కింగ్ మేక‌ర్‌ను అవుతాన‌ని చాలా న‌మ్మ‌కంగా చెప్పిన కుమార స్వామి ఏకంగా కింగే అయిపోయారు.

మొన్న సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కుమార‌స్వామి నేడు అసెంబ్లీలో త‌న బ‌లాన్ని నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ కీల‌క ఘ‌ట్టానికి ముందుగా స్పీక‌ర్ ఎన్నిక మ‌రింత ఆసక్తిని రేకెత్తించింది. కుమార‌స్వామి ప్ర‌భుత్వానికి బ‌లం లేద‌ని, మూడు నెల‌లు కూడా కుమార సీఎంగా ఉండ‌లేర‌ని ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ... స్పీక‌ర్ ప‌ద‌వికి త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపింది. జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి అభ్య‌ర్థిగా ర‌మేశ్ కుమార్ నామినేష‌న్ వేయ‌గా... బీజేపీ అభ్య‌ర్థిగా సురేశ్ కుమార్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కుమార బ‌ల‌ప‌రీక్ష కంటే ముందే జ‌ర‌గాల్సి ఉన్న స్పీక‌ర్ ఎన్నికలోనే కుమార బ‌ల‌మెంతో తేలిపోతుంద‌ని విశ్లేష‌ణ‌లు సాగాయి. అంతేకాకుండా కుమార బ‌ల‌పరీక్ష కంటే కూడా స్పీక‌ర్ ఎన్నికే కీల‌క‌మైంద‌న్న వాద‌న కూడా వినిపించింది. ఈ క్ర‌మంలో కుమార బ‌ల‌ప‌రీక్ష‌కు ముందుగా కాసేప‌టి క్రితం జ‌రిగిన స్పీక‌ర్ ఎన్నిక‌లో జేడీఎస్‌-కాంగ్రెస్ కూట‌మి అభ్య‌ర్థి ర‌మేశ్ కుమార్ స్పీక‌ర్‌ గా ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.

బీజేపీ అభ్య‌ర్థి సురేశ్ కుమార్ పోటీలో ఉండ‌గా... ర‌మేశ్ కుమార్ ఏక‌గ్రీవంగా ఎలా ఎన్నిక‌య్యారంటే... త‌న బ‌ల‌మేంటో తెలుసుకున్న బీజేపీ... స్వ‌యంగా త‌న అభ్య‌ర్థిని బ‌రిలో నుంచి త‌ప్పించేసింది. దీంతో ఓటింగ్ జ‌ర‌గ‌కుండానే బీజేపీ ఓట‌మిని అంగీక‌రించేసింద‌న్న మాట‌. ఈ నేప‌థ్యంలో బ‌రిలో త‌న‌కు పోటీగా ఉన్న సురేశ్ కుమార్ త‌న నామినేష‌న్‌ను విత్ డ్రా చేసుకోవడంతో ర‌మేశ్ కుమార్ ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. మొన్న బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన య‌డ్యూర‌ప్ప కూడా త‌న బ‌ల‌పరీక్ష‌కు ముందే కాడి కింద ప‌డేసిన విష‌యం తెలిసిందే. త‌న మెజార్టీని నిరూపించుకునేందుకు ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాన‌ని ప్ర‌క‌టించిన య‌డ్డీ... చివ‌ర‌కు త‌న పాచిక‌లు పార‌లేద‌ని గ్ర‌హించి... శృంగ‌భంగం ఎందుక‌న్న కోణంలో ఆలోచించి బ‌ల‌ప‌రీక్ష‌కు కాస్తంత ముందుగా స్వ‌చ్ఛందంగా సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసేశారు. దీంతోనే బీజేపీ స‌గం ఓడిపోగా... తాజాగా తానే స్వ‌యంగా స్పీక‌ర్ ఎన్నిక బ‌రిలోకి దింపిన సురేశ్ కుమార్‌ తో తానే నామినేష‌న్‌ ను ఉప‌సంహ‌రింప‌జేసి త‌న ఓటమిని సంపూర్ణం చేసుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇక కుమార‌స్వామి కూడా బ‌ల‌ప‌రీక్ష‌లో విజ‌యం సాధించడం దాదాపుగా ఖ‌రారైపోయిన‌ట్టేన‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఎలాగైనా అధికారం చేజిక్కించుకుందామ‌ని భావించిన బీజేపీకి క‌న్న‌డ నాట దెబ్బ మీద దెబ్బ త‌ప్ప‌లేదన్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.