Begin typing your search above and press return to search.

నాలుగు మార్లు సీఎం.. ఆరేళ్లు పాల‌న‌!

By:  Tupaki Desk   |   24 July 2021 9:30 AM GMT
నాలుగు మార్లు సీఎం.. ఆరేళ్లు పాల‌న‌!
X
మీరు చ‌దివేది క‌రక్టే. ఆయ‌న నాలుగు మార్లు సీఎం కుర్చీలో కూర్చున్నారు. కానీ.. పాలించింది మాత్రం ఆరేళ్ల లోపే! ఇందులో ఒక రికార్డు కూడా ఉంది. దేశంలో అత్యంత త‌క్కువ స‌మ‌యం ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఘ‌న‌త కూడా ఈయ‌న పేరిటే ఉంది. కేవ‌లం రెండున్న‌ర రోజులు మాత్ర‌మే ఆ సీటులో కూర్చున్నారు. ఇంత గొప్ప కేండిడేట్ ఎవ‌రో తెలుసా? క‌ర్నాట‌క బీజేపీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప‌. ప్ర‌స్తుతం ఆయ‌న సీఎంగానే ఉన్నారు. మ‌రో రెండు రోజుల్లో ఆయ‌న రాజీనామా చేయ‌బోతున్నారు. భ‌యంక‌ర‌మైన అద్భుతం ఏదైనా జ‌రిగితే త‌ప్ప‌, ఇది ఆగ‌దు! మ‌రి, ఇలాంటి ట్రాక్ రికార్డును ప్రొఫైల్ పెట్టుకునే ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌న‌ప్పుడు.. ప‌క్క రాష్ట్రం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిరావాల్సిందే.

2007 న‌వంబ‌రులో మొద‌టిసారిగా క‌ర్నాట‌క‌ ముఖ్య‌మంత్రి అయ్యారు య‌డ్యూర‌ప్ప‌. జేడీఎస్ మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించ‌డంతో కొన్ని రోజుల‌కే దిగిపోయారు. ఆ త‌ర్వాత రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు. అనంత‌రం 2008లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో గెలిచి సీఎం అయ్యారు. నాలుగేళ్ల పాల‌న‌ త‌ర్వాత మ‌ళ్లీ రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. సుదీర్ఘ కాలం త‌ర్వాత 2018లో మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కానీ.. బ‌లం నిరూపించుకోలేక‌పోవ‌డంతో కేవ‌లం రెండున్న‌ర రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత 2019 జులై 26న మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ జులై 26న నాలుగో సారి రాజీనామా చేయ‌బోతున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణ‌యం నేప‌థ్యంలో ప‌ద‌వి నుంచి వైదొల‌గ‌బోతున్న‌ట్టు ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

ఈ విధంగా నాలుగుసార్లు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన‌ప్ప‌టికీ.. ఒక్క‌సారి కూడా పూర్తికాలం సీటులో కూర్చోలేదు య‌డ్యూర‌ప్ప‌. దీనంత‌టికీ కార‌ణం ఏమంటే.. క‌నిపించే ఒకే ఒక స‌మాధానం అవినీతి. ముఖ్య‌మంత్రి అయిన ప్ర‌తిసారీ.. యెడ్డీ బంధుగ‌ణం మొదలు, ఆయ‌న స‌న్నిహితులు పాల‌న‌లో అజ‌మాయిషీ చెలాయిస్తార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. డ‌బ్బులు దండిగా వ‌చ్చే ప్రాజెక్టులకు అనుమ‌తులు ఇచ్చేస్తూ.. ధ‌నం పోగేసుకోవ‌డం మీద‌నే దృష్టిసారిస్తార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఒక్క‌సారికాదు.. ఆయ‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన ప్ర‌తిసారీ.. కార‌ణం ఇదే కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఇప్పుడు నాలుగోసారి రాజీనామా చేయ‌బోతున్న‌ది కూడా ఈ కార‌ణం చేత‌నే కావ‌డం విశేషం.

మ‌రి, ఇన్నిసార్లు అవినీతి ఆరోప‌ణ‌ల‌తో ప‌ద‌వి దిగిపోయిన వ్య‌క్తికి.. మ‌ళ్లీ సీఎం సీటును ఎలా అప్ప‌గిస్తోంది బీజేపీ అధిష్టానం? అనే సందేహం రావ‌డం స‌హ‌జం. మ‌రి, కులానికి ఉన్న బ‌లం అదే క‌దా?! మ‌న దేశంలో రాజ‌కీయం కులం, మ‌తం చుట్టూ కేంద్రీకృత‌మైన సంగ‌తి తెలిసిందే. అభ్య‌ర్థి ఎవ‌రు? ఎలాంటి వాడు అని చూసి ఓట్లేసే జ‌నం క‌న్నా.. మ‌న కుల‌పోడేనా? మ‌న మ‌త‌పోడేనా? అని చూసి ఓటు వేసే ప‌రిస్థితి కొన‌సాగుతోంద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఈ కోణంలో చూసుకున్న‌ప్పుడు క‌ర్నాట‌క‌లో బ‌ల‌మైన వ‌ర్గంగా ఉన్న లింగాయ‌త్ వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి య‌డ్యూర‌ప్ప‌. అన్ని విధాలుగానూ ఈ సామాజిక వ‌ర్గం క‌న్న‌డ‌నాట బ‌లంగా ఉంటుంది. పార్టీలు కూడా ఇదే విష‌యాన్ని లెక్క‌లోకి తీసుకుంటాయి కాబ‌ట్టి.. ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. య‌డ్యూర‌ప్పను సీఎం సీటు వెతుక్కుంటూ వ‌చ్చింది.

మ‌రో రెండు రోజుల్లో (జూలై 26) క‌ర్నాట‌క‌లో బీజేపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండేళ్లు పూర్తి కాబోతోంది. ఆ రోజునే యెడ్డీ రాజీనామా చేయ‌డం క‌న్ఫామ్ అయిపోయింది. అయితే.. ముఖ్య‌మంత్రి పీఠాన్ని కాపాడుకోవ‌డానికి య‌డ్యూర‌ప్ప ఏమేం ప్ర‌య‌త్నాలు చేయ‌గ‌ల‌రో.. అన్నీ చేశార‌న్న‌ది ఆఫ్ ది రికార్డ్ సారాంశం. కానీ.. అధిష్టానం అంగీక‌రించ‌లేదట‌. య‌డ్యూర‌ప్ప‌ను ప‌క్క‌న పెట్టాల‌ని అధిష్టానం నిర్ణ‌యం తీసేసుకుంది. అంతేకాదు.. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌న నోటితోనే చెప్పించ‌డం గ‌మ‌నార్హం. దీనికి ఆయ‌న చెప్పిన కార‌ణం ఏమంటే.. బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని ప‌ద‌వుల నుంచి త‌ప్పించే సంప్ర‌దాయం ఉంద‌ని, ఆ కార‌ణంగానే తాను కూడా ప‌క్క‌కు త‌ప్పుకుంటున్న‌ట్టు చెప్పుకొచ్చారు. కానీ.. వాస్త‌వం ఏంట‌నేది త‌మ‌కు తెలుసు అంటున్నారు అక్క‌డి జ‌నం. అయితే.. యెడ్డీ రేపు చేయ‌బోయే రాజీనామా కూడా ఆఖ‌రి సారికాక‌పోవ‌చ్చు. ఏమో..? రేపు ఏం జ‌రుగుతుందో ఎవ‌రు చెప్ప‌గ‌ల‌రు??