Begin typing your search above and press return to search.

కాంట్రాక్టర్ ఆత్మ హత్య కేసు...మంత్రి పదవికి చేటు

By:  Tupaki Desk   |   15 April 2022 9:30 AM GMT
కాంట్రాక్టర్ ఆత్మ హత్య కేసు...మంత్రి పదవికి చేటు
X
కర్నాటకలో ఒక మంత్రిగారికి తన పదవి మూణ్ణాళ్ళ ముచ్చట అయినట్లుగా ఉంది. ఆ మధ్యన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బొమ్మై మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఈశ్వరప్పకు ఇపుడు పదవీగండం ఏర్పడింది. తాజాగా ఒక కాంట్రక్టర్ ఆత్మ హత్య కేసు ఆయన మెడ‌కు చుట్టుకుంది.

ఆయన్ని ప‌ర్సెంటేజిల కోసం మంత్రి గారు వత్తిడి చేశారు అని ఆరోపణలు నేపధ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సూసైడ్ నోట్ లో కూడా మంత్రి మీద సదరు కాంట్రాక్టర్ అనేక ఆరోపణలు చేశారని చెబుతున్నారు.

మొత్తానికి వ్యవహారం కాస్తా మంత్రి కుర్చీ కిందకు నీళ్ళు తెచ్చింది. ఇక దీని మీద ముఖ్యమంత్రి బొమ్మై వెంటనే మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ఈశ్వరప్పని ఆదేశించారు. చేసేది లేక మంత్రి తన పదవీ త్యాగానికి రెడీ అయ్యారు. మొత్తానికి చూస్తే తమది అవినీతి మరక లేని సర్కార్ అని బీజేపీ చెప్పుకుంటోంది.

కర్నాటక‌లో చూస్తే మంత్రి ఇలా కాంట్రాక్టర్ ఆత్మహత్యకు సంబంధించి ఇరుక్కోవడం. ఆయన్ని సొమ్ముల కోసమే డిమాండ్ చేశారని ఆరోపణలు గుప్పుమనడంతో కమలనాధులు ఏమీ చేయలేని పరిస్థితి.

అన్నీ కూడా ఆ తాను లో గుడ్డలే అని ఒక ముతక సామెత ఉంది. ఇపుడు బీజేపీ విషయంలోనూ నిజమని అంటున్నారు. కాంట్రాక్ట్రర్లతో రాజకీయ నేతల స్నేహాలు కూడా మామూలుగా కధలుగానే చెప్పుకుంటారు. కానీ ఇక్కడ బొమ్మ తిరగబడింది.

అందుకే కుర్చీ ఖాళీ చేయాల్సి వచ్చింది అని అంటున్నారు. మరో వైపు కన్నడ సీమలో విపక్షాలు కూడా ఈశ్వరప్ప మీద హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నాయి. రోడ్డెక్కి మరీ ఆందోళనలకు పిలుపు ఇవ్వడంతో బొమ్మై సర్కార్ ఇపుడు చిక్కుల్లో పడుతోంది.