Begin typing your search above and press return to search.

రోశయ్య గవర్నరుగిరీకి ఎసరు

By:  Tupaki Desk   |   12 Aug 2016 10:10 AM GMT
రోశయ్య గవర్నరుగిరీకి ఎసరు
X
కాంగ్రెస్ చేసిన విభజన పాపంతో ఏపీలో ఆ పార్టీ నేతలంతా దిక్కూదివానం లేకుండా మారారు. విభజన నాటికి సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం దాదాపుగా ముగిసింది. అప్పటి మంత్రులు - సీనియర్లు - మాజీ మంత్రులు కూడా చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయారు. ఎవరికీ పదవుల్లేవు. ముందే సర్దుకున్న ఒకరిద్దరు టీడీపీలో చేరి ఎంపీలవడం తప్ప ఇంకెవరికీ మంచి పదవన్నది లేదు. కేవలం మాజీ సీఎం రోశయ్య మాత్రమే తమిళనాడు గవర్నరుగా కీలక పదవిలో కొనసాగుతున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడకముందే గవర్నరు అయిన రోశయ్యను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టలేదు. పలు ఇతర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ మూలాలున్న గవర్నర్లను తొలగించినా రోశయ్యను మాత్రం వదిలిపెట్టారు. అయితే, తమిళనాడు ఎన్నికలకుముందు ఒకసారి ఆయన్ను తొలగిస్తారన్న ప్రచారం జరిగినా ఎందుకో కానీ కేంద్రం ఆయన జోలికి వెళ్లలేదు. అయితే, ఇప్పుడు మాత్రం రోశయ్య గవర్నరుగిరీకి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా, సీనియర్ నేతగా రోశయ్యను మోడీ ప్రభుత్వం చూసీచూడనట్లుగానే వదిలేసింది. ఆయన కూడా వివాదాల జోలికి పోకుండా పదవి కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయిన టైంలోనూ నిరాటంకంగా ఉన్నత పదవిలో కొనసాగుతున్నారు. అయితే, తాజాగా మాత్రం రోశయ్యకు పదవీ గండం తప్పదని తెలుస్తోంది.

రోశయ్య స్థానంలో కర్ణాటక బీజేపీ సీనియర్ నేత డీహెచ్ శంకరమూర్తికి అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలతో పాటు ఆర్ ఎస్ ఎస్ తో సైతం సత్సంబంధాలు కలిగుండటం, వివాదాలకు దూరంగా ఉంటారన్న మంచి పేరు కారణంగా శంకరమూర్తికి గవర్నర్ గా ప్రమోషన్ ఇవ్వాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం శంకరమూర్తి కర్ణాటక శాసన మండలికి చైర్మన్ గా ఉన్నారు. ఇటీవలి మండలి ఎన్నికల అనంతరం - సభలో బీజేపీ బలం తగ్గి - కాంగ్రెస్ పుంజుకుంది.

మండలి చైర్మన్ పదవి సైతం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయే సూచనలు కనిపిస్తున్న తరుణంలో శంకరమూర్తి స్థాయికి తగ్గట్టు ఆయనను తమిళనాడుకు పంపాలని మోదీ భావిస్తున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.. వాస్తవానికి తమిళనాడు ఎన్నికలకు ముందే రోశయ్యను తొలగిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆ పార్టీ అధిష్ఠానం గవర్నర్ మార్పుపై దృష్టిని సారించలేదు. ఇక ఎన్నికలు ముగిసిన తరువాత, తమిళనాట పుంజుకునేందుకు వ్యూహ రచన చేస్తున్న మోడీ, అందులో భాగంగా తొలి ఎత్తు వేసేందుకు సిద్ధమై గవర్నరు పదవిని తమ చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం.