Begin typing your search above and press return to search.

ఆ రెండు రాష్ట్రాల మధ్య నీటి రచ్చ మొదలైందోచ్

By:  Tupaki Desk   |   9 Aug 2021 11:54 AM GMT
ఆ రెండు రాష్ట్రాల మధ్య నీటి రచ్చ మొదలైందోచ్
X
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి జగడం అంతకంతకూ తీవ్రతరం కావటం తెలిసిందే. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేదానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వాలు పంతాలకు.. పట్టింపులకు పోతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. రెండు ప్రాంతాల ప్రజల మధ్య పంచాయితీలు లేకున్నా.. ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణంతో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయన్న మాట వినిపిస్తోంది. జలజగడం విషయంలో రెండు రాష్ట్రాలు రాజీ ధోరణితో వ్యవమరించాలని.. ఒకరి ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకొని ఇచ్చిపుచ్చుకునే ధోరణిని ప్రదర్శిస్తే ఎలాంటి సమస్యలు ఉండవన్న మాట వినిపిస్తున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాలకు పక్కనే ఉన్న తమిళనాడు - కర్ణాటకల మధ్య నెలకొన్న జల వివాదం తెర మీదకు వచ్చింది.

తాజాగా తమిళనాడు సర్కారు తీరుపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసమే ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టటం మంచిది కాదన్న ఆయన.. పొరుగు రాష్ట్రంలోని రాజకీయ నాయకుల మీద ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేయటం గమనార్హం. 'ఇంకా ఎన్నేళ్లు నీటి పంపిణీ విషయంలో రాజకీయాలు చేస్తారు?' అని ప్రశ్నించారు. అదే సమయంలో తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా సిద్ధమంటూ తన వైఖరిని స్పష్టం చేశారు.

ఇంతకూ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బొమ్మయ్ కు ఉన్నట్లుండి తమిళనాడుతో నెలకొన్న నీటి వివాదం ఎందుకు గుర్తుకు వచ్చిందంటే.. దానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల మధ్య కావేరీ నీటి వివాదం ఏ రేంజ్ లో ఉందన్న విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నీటి సమస్యను తీర్చటానికి వీలుగా మేకదాటు ప్రాజెక్టును నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై తమిళనాడు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే.. తమిళనాడులోని రైతులకు నష్టం వాటిల్లుతుందని.. వారి ప్రయోజనాలు దెబ్బ తింటాయని తమిళనాడుకు చెందిన నేతలు.. రైతులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యవహారం అంతకంతకూ ముదురుతున్న వేళ.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విన్నంతనే మంట పుట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడుప్రశ్నగా మారింది. ఇంతకూ సీఎం బసవరాజు బొమ్మయ్ ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

- ప్రజల సమస్యలు పరిష్కరించడానికి రాజకీయాలు చేస్తే ఇబ్బంది ఉండదు. రాజకీయాల కోసమే ప్రజలకు సమస్యలు తెచ్చి పెట్టడం మంచిది కాదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు నీటి పంపిణి విషయంలో రాజకీయాలు చేస్తారు ?
- మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా పోరాడతాం. అందులో ఎలాంటి సందేహం లేదు. తమిళనాడు రాజకీయ నాయకులు వారి లబ్ది కోసం కావేరీ నీటి పంపిణి విషయాన్ని తెర మీదకు తీసుకు వచ్చి కాలం గడిపేస్తున్నారు.
- ఇంకా ఎన్ని సంవత్సరాలు కావేరీ నీటి పంపిణి విషయంలో రాజకీయాలు చేస్తారు ? మేకదాటు ప్రాజెక్టు విషయంలో మేం వెనక్కి తగ్గం. మా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎంత వరకు అయినా పోరాడతాం. మేకదాటు ప్రాజెక్టు విషయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం.