Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు షాకిచ్చిన కర్ణాటక సీఎం

By:  Tupaki Desk   |   21 May 2019 10:55 AM GMT
చంద్రబాబుకు షాకిచ్చిన కర్ణాటక సీఎం
X
అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. దేశంలో హంగ్ వస్తుందని.. ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారుతాయని.. దేశాన్ని ఏలేద్దామని చాలా మంది నేతలు కలలుగన్నారు. కానీ ఆదివారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ దెబ్బకు అందరికి దిమ్మదిరిగి బొమ్మ కనపడింది.

కర్ణాటకలో కేవలం 37 సీట్లు సాధించినా.. కాంగ్రెస్ సపోర్టుతో ఆ రాష్ట్ర సీఎంగా కింగ్ మేకర్ అయ్యాడు కుమారస్వామి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రంలోనూ చక్రం తిప్పుదామని ఆశపడ్డారు. కానీ ఎగ్జిట్ పోల్స్ తో ఎగ్జిట్ అయిపోయాడు.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలైన మమతా బెనర్జీ, మాయవతి, అఖిలేష్ యాదవ్, కుమారస్వామిలను తీవ్ర నిరాశపరిచాయి. వీళ్లంతా ఒకనొక దశలో ప్రధానమంత్రి పదవిపై కన్నేశారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు.

కానీ ఒకే ఒక్కడు చంద్రబాబు మాత్రం ఎన్ని పోల్స్ వచ్చినా కానీ మోడీపై, బీజేపీపై యుద్ధం ఆపడం లేదు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం దేశంలోని 21 ప్రతిపక్షాలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా వీవీప్యాట్లను లెక్కించాలనే డిమాండ్ తో ఈసీని కలవడానికి 21 పార్టీలతో కలిసి వెళ్లారు. అయితే ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

ఈ సమావేశంలో పాల్గొనాలని చంద్రబాబు.. బెంగాల్ వెళ్లి మమతను, యూపీ వెళ్లి అఖిలేష్, మయావతిలను స్వయంగా, కర్ణాటక సీఎం కుమారస్వామిని ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వీరంతా గట్టి షాక్ ఇచ్చారు. వీరి తరుఫున తమ ప్రతినిధులైన సీనియర్ నేతలను పంపారు.

అయితే తొలుత ఈ నిరసనకు వెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్న కుమారస్వామి నిరసనలో పాల్గొనాలని భావించాడట.. కానీ ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా రాద్ధాంతం ఎందుకని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని తన ఢిల్లీ పర్యటనను ఈరోజు రద్దు చేసుకున్నాడు. ఈ మేరకు కన్నడ సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది. కేంద్రంలో మోడీ సర్కారు మరోసారి వస్తున్నాడని ఎగ్జిట్ పోల్స్ తెలుపడంతో విపక్షాలన్నీ డీలాపడ్డాయి. అందుకే రాహుల్, సోనియా సహా మాయ, అకిలేష్, మమత, కుమారస్వామిలు బాబు సమావేశానికి రాకుండా షాక్ ఇచ్చారు. రెండో శ్రేణి నాయకులతో బాబు సమావేశం ఏర్పాటు చేసి ఈసీని కలిసారు. ఇది చంద్రబాబుకు ఒకింత షాక్ గురిచేసేదే.. అయినా పట్టువదలకుండా బాబు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బహుశా మే 23న ఫలితాలు చూసేకే బాబు తన ప్రయత్నాలను ఆపేలా కనిపిస్తున్నాడు.