Begin typing your search above and press return to search.

సీఎం యడ్డీ సంచలన నిర్ణయం .. కొత్తగా 17 మందికి మంత్రి పదవులు !

By:  Tupaki Desk   |   17 Dec 2020 1:09 PM GMT
సీఎం యడ్డీ సంచలన నిర్ణయం .. కొత్తగా 17 మందికి మంత్రి పదవులు !
X
కర్ణాటక సీఎం యడియూరప్ప మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు బదులు కొత్తగా మరో 13 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ ర్యాంకు హోదా కల్పించారు. మరో నలుగురు ఎమ్మెల్యేలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని వివిధ బోర్డులు,కార్పోరేషన్లకు వీరిని ఛైర్‌ పర్సన్లుగా నియమించి ఈ హోదాలని అప్పగించారు. అలాగే ఓ రిటైర్డ్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్‌ మెంట్ ఆఫీసర్‌ కి కూడా కేబినెట్ హోదాతో సీఎం మీడియా అడ్వైజర్ పోస్టు ఇచ్చారు. ప్రస్తుతం యడియూరప్ప కేబినెట్‌ లో 27 మంది మంత్రులు ఉన్నారు. మరో 7 మందికి కేబినెట్ ‌లో స్థానం కల్పించే అవకాశం ఉంది.

అయితే, ఆ ఏడు స్థానాల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం, కేబినెట్ విస్తరణకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఆశావహుల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఉండాల్సిన సంఖ్య కంటే ఎక్కువ మందికి కేబినెట్ హోదాను కట్టబెట్టడంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయా అన్న చర్చ జరుగుతోంది. కొత్తగా కేబినెట్ ర్యాంకు హోదా దక్కించుకున్న ఎమ్మెల్యేల్లో ఎం.చంద్రప్ప, దుర్యోధన్ మహలింగప్ప, నెహ్రూ ఒలేకర్, నరసింహ నాయక్, శివనగౌడ నాయక్, కలకప్ప బండి, శంకర్ పాటిల్ మునెనకొప్ప, మదల్ విరుపక్షప్ప, సిద్దు సవాది, పాటిల్ నదహళ్లి,దత్తాత్రేయ రేవూర్, పి.రాజీవ్, ఎస్.వి.రామచంద్ర ఉన్నారు. సహాయ మంత్రి హోదా దక్కించుకున్నవారిలో రాజ్‌కుమార్ పాటిల్ తెల్కూర్, సీఎస్ నిరంజన్ కుమార్, ఏఎస్ జయరాం, ఎన్.లింగన్న ఉన్నారు.