Begin typing your search above and press return to search.

తెలంగాణకు 'కర్ణాటక' డీజిల్.. తండ్రికొడుకులు ఇప్పుడేమంటారు?

By:  Tupaki Desk   |   4 May 2022 3:29 AM GMT
తెలంగాణకు కర్ణాటక డీజిల్.. తండ్రికొడుకులు ఇప్పుడేమంటారు?
X
గతానికి భిన్నంగా ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీని తనకు తోచినట్లుగా తిట్టేసే అలవాటును సొంతం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. డైలీ బేసిస్ లో ఏదో పాయింట్ మీద ప్రధాని మోడీని విమర్శించటం ఈ మధ్యన ఎక్కువైంది. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే. కేంద్రానికి.. తెలంగాణ రాష్ట్రానికి మధ్య పంచాయితీ నడుస్తుండటం.. తెలంగాణలో ఏదోలా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తున్న వేళ.. తన ప్రయోజనాల్ని దెబ్బ తీసే ప్లాన్ చేస్తున్న బీజేపీ అధినాయకత్వాన్నితీవ్రంగా తప్పు పడుతున్నారు కేసీఆర్. ఈ క్రమంలో ఆయన తరచూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాలకు కేంద్రం చేయాల్సినంత చేయటం లేదని ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో మంత్రి కేటీఆర్ ఒక అడుగు ముందుకు వేసి.. రాష్ట్రాల నుంచి వసూలు చేసే పన్ను మొత్తంలో తిరిగి ఆయా రాష్ట్రాలకు తిరిగి ఇస్తూ చేస్తున్నఖర్చు తక్కువగా ఉందంటూ మండిపడటం తెలిసిందే. ఇదిలాఉంటే.. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ విషయంలో ధరల పెరుగుదల మొత్తం కేంద్రానిదే కారణమని కేసీఆర్ సర్కారు చెబుతోంది. దీనిపై ప్రధాని మోడీ సైతం.. రాష్ట్రాలు పన్ను తగ్గించాలని చెప్పినా తగ్గించలేదని చెప్పటం.. దీనికి కేంద్రంపై రివర్సులో తిట్టి పోస్తున్నారు తండ్రీకొడుకులు ఇద్దరు.

తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నులు పెంచలేదని.. ఒకసారి మాత్రం రౌండాఫ్ చేశామని చెబుతున్నారు. కేంద్రం తగ్గించిన పన్నులు మినహాయించి.. రాష్ట్రాలువసూలు చేసే పన్నుల శాతంలో మాత్రం ఎలాంటి తగ్గింపులు చేయలేదు తెలంగాణ రాష్ట్ర సర్కారు. అదే సమయంలోకేంద్రం కారణంగానే తెలంగాణలో పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగినట్లుగా ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆర్టీసీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రానికి.. తెలంగాణకు మధ్యన లీటరు డీజిల్ కు దాదాపు రూ.11 వరకు తక్కువ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో లీటరు పెట్రోల్ రూ.119.47 ఉంటే.. డీజిల్ మాత్రం లీటరురూ.106.76గా ఉంది. అదే సమయంలో కర్ణాటకలో మాత్రం డీజిల్ లీటరు రూ.95.57 ఉండటంతో కర్ణాటక సరిహద్దులకు దగ్గర్లో ఉండే తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో డీజిల్ నుకర్ణాటకలో కొట్టించుకుంటున్నారు. దీనికి తోడు ట్యాంకర్ల రూపంలో తెచ్చుకుంటూ వాడుకుంటున్నారు.

ఈ కారణంగా ఆర్టీసీకి నెలకు రూ.20 లక్షల మేర ఖర్చు తగ్గుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోతున్న టీఎస్ ఆర్టీసీకి పెట్రో మంట తగలకుండా ఉండేందుకు వీలుగా కర్ణాటక నుంచి డీజిల్ తెప్పించుకుంటున్నారు. దీని వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్రంలో డీజీల్ కొనుగోలు చేస్తే.. దాని మీద వసూలు చేసే పన్ను ఆదాయం రాష్ట్రానికి వస్తుందంటున్నారు.

అంతేకాదు.. డీజిల్ అమ్మకాలతో పెట్రోల్ బంకులకు కూడా లాభం రూపంలో ఆదాయం వస్తుందని.. అదంతా కర్ణాటకకు పోతుందంటున్నారు. ఒకపక్క డీజిల్ ధర ఎక్కువగా ఉండటానికి కారణం కేంద్రమని చెబుతున్న కేసీఆర్ కు.. వారి ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో మాత్రం లీటరు డీజిల్ ధరలో రూ.11లకు కాస్త ఎక్కువగానే తక్కువగా ఉండటతో తెలంగాణలోని కర్ణాటక సరిహద్దు గ్రామాలకు వెళ్లి మరీ డీజిల్ కొట్టేసుకుంటున్నారు. మరి.. దీనికి తండ్రికొడుకులు ఎలా రియాక్టు అవుతారో?