Begin typing your search above and press return to search.

నిర్బ‌య త‌ల్లిపై మాజీ డీజీపీ అనుచిత వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   16 March 2018 6:15 AM GMT
నిర్బ‌య త‌ల్లిపై మాజీ డీజీపీ అనుచిత వ్యాఖ్య‌లు
X
నెత్తి మీద‌కు వ‌య‌సు రాగానే స‌రిపోదు. అత్యుత్త‌మ స్థానాల్లో విధులు నిర్వ‌ర్తించినా.. సంస్కారం స‌న్న‌గిల్ల‌ద‌న్న గ్యారెంటీ ఏమీ ఉండ‌దు. ఇందుకు తాజా ఉదంత‌మే నిద‌ర్శ‌నం. గౌర‌వ‌నీయ‌స్థానాల్లో ఉన్న ఒక వ్య‌క్తి చేసిన చుల‌క‌న వ్యాఖ్య‌లు ఇప్పుడు పెను క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.

యావ‌త్ దేశాన్ని క‌దిలించిన నిర్బ‌య దారుణాన్ని దేశ ప్ర‌జ‌లు ఇంకా మ‌ర్చిపోలేదు. ఆమెకు జ‌రిగిన దారుణాన్ని ఈ రోజుకు త‌లుచుకున్నా దుంఖం పొంగుకు వ‌స్తుంది. అలాంటిది.. ఒక మాజీ పోలీస్ బాస్ చేసిన దుర్మార్గ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఈ విష‌యం తెలిసిన ప్ర‌తిఒక్క‌రూ తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌డిబొడ్డున క‌దిలే బ‌స్సులో నిర్భ‌య‌పై చేసిన అమానుష అత్యాచారం చేయ‌టం.. మాన‌వ మృగాలుగా వ్య‌వ‌హ‌రించిన దుర్మార్గం దేశ ప్ర‌జ‌ల్ని క‌ద‌లించ‌ట‌మే కాదు.. యూపీఏ స‌ర్కారు ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. మ‌హిళ‌ల‌పై జ‌రిగే లైంగిక దాడుల‌కు చెక్ పెట్టేందుకు నిర్బ‌యపేరుతో ప్ర‌త్యేక చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. మ‌హిళ‌ల ప‌ట్ల‌.. కొంద‌రిలో ఉన్న‌చిన్న‌చూపు ఎంత బ‌లంగా ఉందో క‌ర్ణాట‌క మాజీ డీజీపీ సంగ్లియానా వ్యాఖ్య‌లు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

మ‌హిళ‌ల్ని స‌న్మానించేందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దీనికి క‌ర్ణాట‌క మాజీ డీజీపీ హెచ్ టీ సంగ్లియానాను.. నిర్బ‌య త‌ల్లి ఆశాదేవి వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన సంగ్లియా తాను ఎందుకీ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారో మ‌ర్చిపోయిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. కార్య‌క్ర‌మానికి సంబంధం లేని వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న పెను క‌ల‌క‌లాన్ని సృష్టించారు. నిర్బ‌య త‌ల్లిని చూశాన‌ని.. ఆమె చ‌క్క‌గా.. అందంగా ఉన్నార‌ని.. త‌ల్లే ఇంత అందంగా ఉంటే ఇక నిర్బ‌య ఎంత అందంగా ఉండేదో తాను ఊహించ‌గ‌ల‌నంటూ పైత్య‌పు మాట‌లు మాట్లాడారు.

అంతేకాదు.. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మ‌హిళ‌ల‌కు కొన్ని ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. మ‌హిళ‌ల్ని ఉద్దేశించి ఆయ‌న చేసిన చెత్త వ్యాఖ్య‌లు క‌డుపు ర‌గిలించేవిగా ఉన్నాయ‌ని చెప్పాలి. మ‌హిళ‌లు ఎంత బ‌ల‌వంతులైనా స‌రే రేపిస్టుల‌కు లొంగిపోవాల్సిందేన‌ని.. అలా అయితే వారి జీవితాలు సుర‌క్షితంగా ఉంటాయ‌న్నారు. తాను చెప్పే మాట‌లు కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన ప్ర‌తిఒక్క‌రికి వ‌ర్తిస్తాయ‌ని చెప్ప‌టం సంచ‌ల‌నంగా మారింది. సంగ్లియా వ్యాఖ్య‌లు పెను దుమారాన్ని రేప‌ట‌మే కాదు.. ఆయ‌న భేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ధ‌ర్నా చేప‌ట్టాయి.