Begin typing your search above and press return to search.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై `లింగాయ‌త్ల` ప్ర‌భావ‌మెంత‌?

By:  Tupaki Desk   |   20 March 2018 12:46 PM GMT
క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై `లింగాయ‌త్ల` ప్ర‌భావ‌మెంత‌?
X
కర్ణాటకలోని లింగాయత్ ల‌ను ప్రత్యేక మతంగా గుర్తించడానికి కర్ణాటక కేబినెట్ అంగీకరించింన సంగ‌తి తెలిసిందే. వారికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ చేసిన సిఫార‌సు ను క‌ర్ణాట‌క‌ కేబినెట్ ఆమోదించింది. వారిని ప్ర‌త్యేక మ‌తంగా గుర్తించాలంటూ కేంద్రానికి సీఎం సిద్ధ రామ‌య్య సిఫారసు చేశారు. ప్ర‌స్తుతానికి ఆ అంశంపై కేంద్రం తుది నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ నిర్ణ‌యంపై ఆరెస్సెస్ - బీజీపీలు డైల‌మాలో ప‌డ్డాయి. ఏది ఏమైనా - తాజాగా, సీఎం సిద్ధ రామ‌య్య తీసుకున్న ఈ నిర్ణ‌యం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌బోతోన్న ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఓ ర‌కంగా ఈ నిర్ణ‌యం కాంగ్రెస్ కు క‌ర్ణాట‌క‌లో అధికారం క‌ట్ట‌బెట్టే అవ‌కాశ‌ముంది. క‌ర్ణాట‌కలోని 224 అసెంబ్లీ సీట్ల‌లో దాదాపు 100 సీట్ల‌ను లింగాయ‌త్లు ప్ర‌భావితం చేయ‌నున్నారు.

క‌ర్ణాట‌క‌లో 17 శాతం ఉన్న లింగాయ‌త్లు చాలాకాలంగా బీజేపీ ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. ఆ ఓటు బ్యాంకును త‌మ‌వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ఈ ఎత్తుగ‌డ వేసింది. సిద్ధ రామ‌య్య నిర్ణయంతో బీజేపీ చిక్కుల్లో ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. ముందు నుయ్యి...వెనుక గొయ్యి...అన్న చందంగా బీజీపీ ప‌రిస్థితి ఉంది. ఒక వేళ లింగాయ‌త్ ల‌ను మైనారిటీలుగా ప‌రిగ‌ణించ‌డాన్ని కేంద్రం వ్య‌తిరేకిస్తే....ఆ వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకోవ‌డానికి కాంగ్రెస్ రెడీగా ఉంది. అలా కాకుండా, కేంద్రం కూడా రాష్ట్ర నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తే...అపుడు కూడా త‌మ‌కే మైలేజ్ వ‌స్తుంద‌ని సిద్ధ‌రామ‌య్య భావిస్తున్నారు. త్వ‌ర‌లోనే త‌న మంత్రివ‌ర్గంలో ఉన్ లింగాయ‌త్ మంత్రుల‌తో క‌లిసి ఓ ర్యాలీ చేసేందుకు సిద్ధూ ప్లాన్ చేస్తున్నారు. అయితే, కేవలం ఓటు బ్యాంకు రాజ‌కీయాల కోస‌మే ప్ర‌జ‌ల‌ను మ‌తాల పేరుతో కాంగ్రెస్ చీల్చాల‌ని చూస్తోంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ నిర్ణ‌యం లింగాయ‌త్ల‌ను తాత్కాలికంగా మెప్పించేలా ఉన్నప్ప‌టికీ....ఆ మైనార్టీ హోదా వారికి పూర్తిగా అందేందుకు చాలా స‌మ‌యం ప‌డుతోంద‌ని బీజేపీ భావిస్తోంది. అయితే, లింగాయ‌త్ల‌లోని ఉప వ‌ర్గమైన వీర‌శైవులు...తాజా నిర్ణ‌యం పై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌డం కాంగ్రెస్ కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.

వాస్త‌వానికి, లింగాయత్ లు 12వ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుని అనుచరులు. బ‌స‌వేశ్వ‌రుని వ‌చ‌నాల ప్ర‌కారం లింగాయ‌త్ లు ...ఇష్ట‌లింగాన్ని(నిరాకారుడు) ఆరాధిస్తారు. వీరంతా త‌మ‌ను హిందువులుగా కాకుండా ప్ర‌త్యేక మ‌తంగా గుర్తించాల‌ని చాలాకాలంగా కోరుకుంటున్నారు. వీర‌శైవులు...లింగాయ‌త్ ల‌లో ఒక ఉప వ‌ర్గానికి చెందిన వారు. ఆగ‌మ శాస్త్రాలు - వేదాల్లో కూడా వీర‌శైవుల ప్ర‌స్తావ‌న ఉంది. వారంతా, ప‌ర‌మ శివుడిని త‌ప్ప వేరెవ‌రినీ ఆరాధించ‌రు. అందుకే, వారు లింగాయ‌త్ లు కూడా హిందువులేన‌ని , త‌మ‌కు ప్ర‌త్యేక మతంగా మైనారిటీ హోదా అవ‌స‌రం లేద‌ని వాదిస్తున్నారు. సిద్ధ‌రామ‌య్య స‌ర్కార్ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా వారంతా నిర‌స‌న‌లు కూడా తెలిపారు. దీంతో, లింగాయత్ల గ్రూపులో వీరశైవ లింగాయత్ల‌ను ఒక వ‌ర్గంగా పిలవాలని కేటినెట్ నిర్ణ‌యించింది. వీర‌శైవులు ....లింగాయ‌త్ల‌లోని ఒక ఉప వ‌ర్గానికి చెందిన వార‌ని స్ప‌ష్టం చేసింది. తదుప‌రి భేటీలో ఆ విష‌యంపై తుది నిర్ణ‌యం తీసుకోనుంది.