Begin typing your search above and press return to search.

విగ్రహాల పోటీలో కర్నాటక..1200 కోట్ల ప్రాజెక్టు

By:  Tupaki Desk   |   16 Nov 2018 4:37 AM GMT
విగ్రహాల పోటీలో కర్నాటక..1200 కోట్ల ప్రాజెక్టు
X
గుజరాత్‌ లో సర్దార్‌ వల్లబాయి పటేల్‌ - మహారాష్ట్రలో చత్రపతి శివాజీ విగ్రహం....ఇలా భారీ విగ్ర‌హాల ఏర్పాటులో ఆయా రాష్ర్టాలు బిజీబిజీగా ఉండ‌టం చూస్తుంటే...ప్రస్తుతం భారీ విగ్రహాల పోటీ సీజన్‌ నడుస్తోందా అంటూ ప‌లువురు చ‌మ‌త్క‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే కోవ‌లో ఇప్పుడు కర్నాటక కూడా ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. మైసూరులోని బృందావన్‌ గార్డెన్స్‌ సమీపాన 360 ఎకరాల్లో నిర్మించే డిస్నీల్యాండ్‌ లో 125 అడుగుల ఎత్తయిన కావేరి మాత శిలా విగ్రహాన్ని నిర్మించనున్నట్లు కర్నాటక వైద్యవిద్య శాఖ మంత్రి డికె శివకుమార్‌ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు రూ.1200 కోట్లతో ప్రభుత్వ ప్రయివేట్‌ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ ను చేపట్టన్నుట్లు తెలిపారు. కావేరీ మాత విగ్రహంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొలువుదీరిన ప్రఖ్యాత పర్యాటక క్షేత్రాల్లోని విగ్రహాల ప్రతిరూపాలను కూడా ఇక్కడ నెలకొల్పుతామని ఆయన వివరించారు. కావేరి మాత భారీ విగ్రహం వద్ద నుంచి కృష్ణరాజ సాగర్‌ జలాశయాన్ని కావేరి నదీ పరిసర ప్రాంతాలను నేరుగా వీక్షించేందుకు వీలుగా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. కావేరి నదికి దక్షిణ కర్నాటక జీవనాడిగా పేరున్న సంగతి తెలిసిందే.

పర్యాటక శాఖ మంత్రి సారా మహేశ్ కలిసి ఈ ప్రాజెక్టుపై అధికారులతో చర్చించిన‌ అనంతరం శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించనున్నామని చెప్పారు. విగ్రహం తదితర పనుల కోసం ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయబోమని - విరాళాల ద్వారా ఈ పనులను చేపడుతామని వివరించారు. మాండ్యా జిల్లాలోని కృష్ణ రాజ సాగర్ రిజర్వాయర్ సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విగ్రహంతోపాటు మ్యూజియం కాంప్లెక్స్ - రెండు అద్దాల భవనాలను కూడా నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, ప‌టేల్ విగ్ర‌హం ఏర్పాటుపై విమ‌ర్శ‌లు గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు త‌మ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ విగ్ర‌హంపై ఎలా స్పందిస్తుందో చూడాలి మ‌రి.