Begin typing your search above and press return to search.

రాత్రి వేళ లేఖ‌.. ఉద‌యాన్నే ప్ర‌మాణ‌స్వీకారం

By:  Tupaki Desk   |   17 May 2018 4:04 AM GMT
రాత్రి వేళ లేఖ‌.. ఉద‌యాన్నే ప్ర‌మాణ‌స్వీకారం
X
క‌ర్ణాట‌క రాజ‌కీయంలో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసి.. ఏ పార్టీకి ఎన్నేసి సీట్లు ఉన్నాయి? ఓట్ల లెక్కింపు అనంత‌రం బీజేపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తే.. ఎన్నిక‌ల త‌ర్వాత జ‌త క‌ట్టిన కాంగ్రెస్‌.. జేడీఎస్ కూట‌మికి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే బ‌లం పూర్తిగా ఉండ‌టం తెలిసిందే. ఇలాంటి వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం కీల‌క‌మైంది.

విచ‌క్ష‌ణ‌తో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం మీద‌నే ప్ర‌భుత్వ ఏర్పాటు ఉంటుంది. దీంతో.. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌న్న ఉత్కంట నెల‌కొంది. వివిధ పార్టీల బ‌లాబ‌లాలు స్ప‌ష్టంగా ఉన్నా గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి బీజేపీ మ‌హా ఎత్తుగ‌డ వేసింది. ఇందులో భాగంగా రాత్రి 10 గంట‌ల త‌ర్వాత ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాజ్ భ‌వ‌న్ నుంచి య‌డ్యూర‌ప్ప‌కు ఆహ్వానం అందింది.

దీనికి వెంట‌నే స్పందించిన య‌డ్యూర‌ప్ప తాము గురువారం ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తామ‌ని రాజ్ భ‌వ‌న్ కు స‌మాచారం ఇచ్చారు. ఆ త‌ర్వాత నుంచి జోరుగా ప‌నులు మొద‌ల‌య్యాయి. ఇదిలా ఉంటే.. ఇంత రాత్రి వేళ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గ‌వ‌ర్న‌ర్ ఆహ్వానం ఎందుకు పంపిన‌ట్లు? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. పొద్దున నుంచి కామ్ గా ఉన్న రాజ్ భ‌వ‌న్ రాత్రి 10 గంట‌ల త‌ర్వాత లేఖ పంపటం వెనుక భారీ ఎత్తుగ‌డే ఉందని చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ప‌ని వేళ‌లు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు ప‌ని చేస్తుంది. గ‌వ‌ర్న‌ర్ నుంచి లేఖ బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే కాంగ్రెస్ న్యాయ‌పోరాటానికి దిగుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే సుప్రీం ప‌ని వేళ‌లు ముగిసిన త‌ర్వాత లేఖ‌ను విడుద‌ల చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

అదే స‌మ‌యంలో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరేందుకు కీల‌క‌మైన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి కోర్టు వేళ‌లు ప్రారంభం కావ‌టానికి ముందే ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వాన్ని పూర్తి చేయాల‌న్న వ్యూహాన్ని బీజేపీ సిద్ధం చేసింది. దీనికి కౌంట‌ర్ ఇచ్చేలా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించింది.

గ‌వ‌ర్న‌ర్ నుంచి లేఖ బీజేపీకి వెళ్లింద‌ని తెలియ‌టానికి ముందే సుప్రీంలో హౌస్ మోష‌న్ కు రంగం సిద్ధం చేసింది. అభిషేక్ సింఘ్వీ స‌హా లాయ‌ర్లంతా గ‌వ‌ర్న‌ర్ తీరును ఎండ‌గ‌ట్ట‌టానికి వీలుగా రెఢీ అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ నుంచి లేఖ య‌డ్యూర‌ప్ప‌కు చేరిన త‌ర్వాతి క్ష‌ణంలోనే సుప్రీంకు చేరుకున్నారు. సీజే నివాసానికి వెళ్లి త‌మ అభ్య‌ర్థ‌న‌ను వినిపించారు. అయితే.. ఇక్క‌డ బీజేపీ వ్యూహ‌మే వ‌ర్క్ వుట్ అయ్యింద‌ని చెప్పాలి. కాకుంటే.. అర్థ‌రాత్రి వేళ‌.. సుప్రీం త‌లుపులు తెరిపించి.. త‌మ వాద‌న‌లు వినేలా చేయ‌టంలో మాత్రం కాంగ్రెస్ స‌క్సెస్ అయ్యింది.