Begin typing your search above and press return to search.

కన్నడ సంక్షోభం.. మంత్రుల రాజీనామా

By:  Tupaki Desk   |   9 July 2019 4:31 AM GMT
కన్నడ సంక్షోభం.. మంత్రుల రాజీనామా
X
కన్నడ పాలిటిక్స్ క్లైమాక్స్ చేరుకుంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఇప్పటికే 13మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేసి బీజేపీకి స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలోనే కాంగ్రెస్-జేడీఎస్ వ్యూహాత్మకంగా ముందుకు కదిలింది. మంత్రివర్గంలోని మొత్తం 21మంది కాంగ్రెస్ మంత్రులు - 9మంది జేడీఎస్ మంత్రులను తమ మంత్రి పదవులకు రాజీనామా చేయించింది. దీంతో కర్ణాటక రాజకీయం రంజుగా మారింది.

మంత్రుల రాజీనామా నేపథ్యంలో వీలైనంత త్వరగా మంత్రివర్గ పునర్వస్థీకరణ చేసి రాజీనామా చేసిన అసంతృప్త 13మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు నిర్ణయించారు. దీంతో ఈ సంక్షోభాన్ని అసంతృప్తులకు మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా చల్లార్చాలని యోచిస్తున్నాయి.

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి 118 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో ఐదుగురు తగ్గితే ప్రభుత్వం కూలిపోతుంది. అయితే 13మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదిస్తే ప్రభుత్వం కూలిపోతుంది. దీంతో స్పీకర్ నిర్ణయంపైనే కర్ణాటక సర్కారు ఆధారపడి ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్యేల రాజీనామాలు ఒత్తిడితో చేసిన రాజీనామాలని స్పీకర్ ఆమోదించవద్దని కోరింది.

ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రంగంలోకి దిగి మంత్రులందరితో రాజీనామాలు చేయించారు. అసంతృప్తులకు పదవులు ఇస్తామని.. మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరణ చేస్తామని ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సిద్ధరామయ్య కూడా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతో ఈ సంక్షోభం చల్లారుతుందని తెలిపారు.

ఇక తాను ఇలాంటి రాజకీయ సంక్షోభంపై భయపడడం లేదని.. రాష్ట్రాన్ని పరిపాలించాల్సి బాధ్యత తనపై ఉందన్నారు. నా బాధ్యత తాను నెరవేరుస్తానని కర్ణాటక సీఎం కుమారస్వామి అన్నారు.

ఇక బీజేపీ కన్నడ సర్కారు సంక్షోభంలో కూరుకుపోయిందని .. సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని మంగళవారం నుంచి కన్నడ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఇక కన్నడ సంక్షోభంపై పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. కన్నడ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని లోక్ సభలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనికి రక్షణమంత్రి రాజ్ నాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడే రాజీనామాలకు శ్రీకారం చుట్టారని.. అందుకే ఆయన అనుయాయులు పార్టీ నేతలు కర్ణాటకలో అనుసరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.