Begin typing your search above and press return to search.

బాబు చెప్పుకోలేని ఘనతను ఆ సీఎం చెప్పేసుకున్నాడు

By:  Tupaki Desk   |   25 Sep 2019 10:12 AM GMT
బాబు చెప్పుకోలేని ఘనతను ఆ సీఎం చెప్పేసుకున్నాడు
X
గొప్పలు చెప్పుకోవటం ఎవరైనా చేస్తారు. కానీ.. ఏదైనా నెగిటివ్ అంశాన్ని సెంటిమెంట్ గా మార్చి.. తమ ఖాతాలోకి వేసుకోవటానికి ఏ అధినేత ముందుకు రారు. ఆ మాటకు వస్తే అంత సాహసం చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా.. మనసుకు తోచిన మాటను చెప్పేశారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ఆయన మాటలు విన్నంతనే చంద్రబాబు గుర్తుకు రాక మానరు.

ఇంతకీ.. యడ్డి చెప్పిన మాటలేందన్న విషయంలోకి వెళితే.. తాను ముఖ్యమంత్రి పదవిలో వచ్చిన ప్రతిసారీ ప్రకృతి నుంచి అగ్ని పరీక్ష ఎదురవుతోందన్నారు. తాజాగా వెల్లువెత్తిన వరదలతో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి అందే సాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆయన.. నాలుగైదు రోజుల్లో కేంద్రం నుంచి సాయం అందుతుందన్నారు.

తాను సీఎం అయిన ప్రతిసారీ ప్రకృతి నుంచి అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తోందని.. గడిచిన 110 ఏళ్లలో ఎప్పుడూ లేని రీతిలో వర్షాలు విరుచుకుపడటం.. వరదల కారణంగా భారీ విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఓవైపు కరవు.. మరోవైపు వరదల కారణంగా రెండు భిన్నమైన పరిస్థితుల్ని తాము ఒకేసారి ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. 2008లో తాను సీఎం అయినప్పుడు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయన్నారు. యడ్డి మాటలు విన్నంతనే ప్రతి తెలుగోడి మనసులోకి చంద్రబాబు గుర్తుకు రావటం ఖాయం.

ఎందుకంటే.. ఆయన ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ ఏపీలో వర్షాలు పడకపోవటం.. క్షామంతో ప్రజలు ఇబ్బంది పడటం తెలిసిందే. ఒకవేళ పడితే హూధూద్ లాంటి విపత్తులే తప్పించి.. అవసరమైన మేరకు వర్షాలు పడటం మాత్రం ఉండదు. తన హయాంలో వర్షాలు పడవని.. వరుణుడు కరుణించడని.. అయితే గియితే ఆగ్రహం వ్యక్తం చేస్తాడన్న మాటల్ని బాబు చెప్పలేదు. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండా యడ్డి మాత్రం తన హయాంలో విరుచుకుపడే ప్రకృతి విపత్తుల గురించి భలేగా ఒప్పుసుకున్నారు కదా?