Begin typing your search above and press return to search.

ఆ మంత్రికి సన్మానం చేయించుకున్న సంతోషం లేకుండా పోయింది

By:  Tupaki Desk   |   3 Jun 2020 4:45 AM GMT
ఆ మంత్రికి సన్మానం చేయించుకున్న సంతోషం లేకుండా పోయింది
X
గతానికి భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. ఒక చిన్న తప్పు చాలు.. ఏకిపారేయటానికి సోషల్ మీడియా వేదికలు సిద్ధంగా ఉంటాయి. దీనికి తోడు.. అందరి చేతుల్లోకి వచ్చేసిన స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఎడాపెడా ఫోటోలు.. వీడియోలు తీయటం ఒక ఎత్తు అయితే.. వాట్సాప్.. సోషల్ మీడియాలతో క్షణాల్లో వైరల్ అయ్యే పరిస్థితి. బాధ్యతాయుతమైన రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న కర్ణాటక రాష్ట్ర మంత్రి శ్రీరాములు చేసిన పనిని చూసినోళ్లంతా మండి పడుతున్నారు.

తాజాగా ఆయన చిత్రదుర్గ జిల్లా చల్లకేరే తాలుకాలోని పరశురాంపురలోని ఆలయానికి ఉత్సావానికి హజరయ్యారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇలా ఉత్సవాలకు హాజరుకావటం సరైనది కాదన్న విమర్శలు వినిపిస్తున్న వేళలోనే.. ఆయన అభిమానులు.. కార్యకర్తలు చేసిన హడావుడిని పలువురు తప్పు పడుతున్నారు. ఉత్సవాలకు హాజరైన మంత్రిగారి మనసును దోచేందుకు వీలుగా.. ఆయన కార్యకర్తలు భారీ యాపిల్ గజమాలను సిద్ధం చేశారు.

వందలాది యాపిల్స్ తో సిద్ధం చేసిన ఈ వినూత్న గజమాలను వేసే క్రమంలో కార్యకర్తలు ఒకరి మీద ఒకరు పడుతూ.. కేరింతలు కొడుతూ సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితేల్లో భౌతికదూరాన్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. కానీ.. అదేమీ పట్టక.. నిబంధనల్ని తుంగలోకి తొక్కిన మంత్రిగారి అనుచరుల తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కు ట్విస్టు ఏమిటంటే.. సన్మానం పూర్తి అయిన తర్వాత మాట్లాడిన మంత్రి శ్రీరాములు.. మాయదారి రోగం ముప్పు ఎక్కువగా ఉన్న వేళ.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలంటూ ఆయన చెప్పిన మాటలు విన్నోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. చేయాల్సిందంతా చేసి.. చివర్లో ఈ నీతి మాటలేంది? అన్న ప్రశ్న పలువురికి కలుగుతోంది.