Begin typing your search above and press return to search.

కర్ణాటకలో..'రెడ్డొచ్చె.. మొదలాడు..' అన్నట్టవుతుందా!

By:  Tupaki Desk   |   14 Nov 2019 8:49 AM GMT
కర్ణాటకలో..రెడ్డొచ్చె.. మొదలాడు.. అన్నట్టవుతుందా!
X
కర్ణాటక లో ప్రభుత్వ గమనం అటూ ఇటూ సాగుతూ ఉంది. ప్రజలు ఇచ్చిన అస్పష్ట మైన తీర్పుతో అక్కడ ఎవరికీ సంపూర్ణ మెజారిటీ రాలేదు. బీజేపీ మొదట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మెజారిటీ నిరూపించు కోలేకపోవడం జరిగింది. ఆ పై కాంగ్రెస్-జేడీఎస్ లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ ప్రభుత్వ మనుగడ ఏడాది పైనే సాగింది.

అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది. ఆ ఎమ్మెల్యే లపై అనర్హత వేటు పడింది. ఆ వేటును సుప్రీం కోర్టు కూడా సమర్థించడం, ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతూ ఉండటం తెలిసిన సంగతే.

ఈ ఉప ఎన్నికలకు ఇప్పటికే ముహూర్తం కూడా వచ్చేసింది. డిసెంబర్ ఐదున పోలింగ్ జరగబోతూ ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పై తిరుగుబాటు చేసి అనర్హత వేటు పొందిన వారందరూ ఇప్పుడు బీజేపీ లోకి చేరిపోయారు. వారిలో ఎంతమందికి బీజేపీ టికెట్లు ఇస్తుందో తెలీదు.

వారంతా బేషరతుగా చేరినట్టుగా ప్రకటించుకున్నారు. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయిన ఓకే అన్నారట! అయితే అవన్నీ కాంగ్రెస్-జేడీఎస్ ల సీట్లు. ప్రభుత్వ వ్యతిరేకతలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ సీట్లలో తన అభ్యర్థులను గెలిపించుకోగలిగింది. ఇప్పుడు తమ పార్టీ వారు ఫిరాయించడంతో కొత్త వారితో కాంగ్రెస్ సమరానికి సై అంటోంది.

ఇక గత రెండేళ్ల రాజకీయ పరిణామాలతో ప్రజలు కూడా ఒకరకమైన విసుగుతో ఉండవచ్చు. బీజేపీ వాళ్లు ఎలా అధికారంలోకి వచ్చారో అందరికీ తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఆ కాంగ్రెస్ నియోజకవర్గాల్లో బీజేపీ పై వ్యతిరేకత పెద్దదై.. ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోతే యడియూరప్ప ప్రభుత్వానికి సంకటం మొదలైనట్టే!

ఫిరాయింపుదారులకు బీజేపీ కాషాయ తీర్థం ఇచ్చింది. ఫిరాయింపు నేతలను ప్రజలు ఆదరించకపోతే అంతే సంగతులు! ఫిరాయింపుదారులను ప్రజలు ఛీత్కరించుకుని బీజేపీ వైపు మొగ్గక, మళ్లీ ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే.. రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టుగా మారిపోతుంది కర్ణాటకలో పరిస్థితి. అయితే ఉప ఎన్నికల్లో తమదే విజయం అంటూ బీజేపీ వాళ్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. అసలు కథ ఎలా ఉండబోతోందో!